Share News

గంజాయిపై ఉక్కుపాదం

ABN , Publish Date - May 02 , 2026 | 12:29 AM

నిరంతర నిఘాను పెంచి, గంజాయి రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎస్పీ తుహిన్‌సిన్హాతో కలిసి కె.కోటపాడు పోలీసు సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, క్రైమ్‌ రికార్డులను పరిశీలించారు.

గంజాయిపై ఉక్కుపాదం
కె.కోటపాడు స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐలతో మాట్లాడుతున్న రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి. చిత్రంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా, డీఎస్పీ శ్రావణి ఉన్నారు.

రవాణా కట్టడికి నిఘాను మరింత పెంచాలి

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి

కె.కోటపాడు, మే 1 (ఆంధ్రజ్యోతి): నిరంతర నిఘాను పెంచి, గంజాయి రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎస్పీ తుహిన్‌సిన్హాతో కలిసి కె.కోటపాడు పోలీసు సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, క్రైమ్‌ రికార్డులను పరిశీలించారు. ఆయా కేసుల దర్యాప్తు పురోగతి గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చీటింగ్‌, ఇతర కేసుల సీడీ ఫైల్స్‌, పెండింగ్‌ ట్రయల్‌ కేసుల ఫైళ్లు, ప్రాపర్టీ రిజిస్టర్‌, కోర్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మహిళల చట్టాలపై అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామాలను తరచూ సందర్విస్తూ.. సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు. అనంతరం సచివాలయ మహిళా పోలీసులతో మాట్లాడుతూ, మహిళా రక్షణ చట్టాలు, శక్తి యాప్‌పై గ్రామాల్లో మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ శ్రావణి, సీఐ కె.కృష్ణ, ఎస్‌ఐలు వున్నారు.

Updated Date - May 02 , 2026 | 12:29 AM