Share News

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:39 AM

భావితరాలను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడం ద్వారా డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలో మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు, యువత డ్రగ్స్‌బారిన పడకుండా అవగాహన సదస్సులు జరుపుతున్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాలో భాగస్వాములవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా (ఫైల్‌ ఫొటో)

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు బహుముఖ వ్యూహం

జిల్లా మీదుగా రవాణా నిరోధానికి పోలీసు శాఖ పటిష్ఠ నిఘా

నిందితులపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు

జిల్లా స్థాయిలో నార్కో కో-ఆర్డిరేషన్‌ కమిటీ

విద్యార్థులు, యువతకు అవగాహన సదస్సులు

విద్యాలయాల్లో ఈగల్‌ క్లబ్‌ల ఏర్పాటు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

భావితరాలను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడం ద్వారా డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలో మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు, యువత డ్రగ్స్‌బారిన పడకుండా అవగాహన సదస్సులు జరుపుతున్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాలో భాగస్వాములవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ నేతృత్వంలో జిల్లా స్థాయిలో నార్కో కో-ఆర్డిరేషన్‌ (ఎన్‌సీఓఆర్‌డీ) కమిటీని ఏర్పాటు చేశారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డీ-అడిక్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి, ఎస్పీ తుహిన్‌సిన్హా ఆధ్వర్యంలో ‘సంకల్పం’ పేరుతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లిలో సైకిల్‌ యాత్రలు నిర్వహించి ప్రజల్లో ఛైతన్యం కల్పించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, ఇతర విద్యాలయాల్లో, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో ఎదురయ్యే అనర్థాలపై ఇప్పటికే 350 ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, 20కిపైగా కళాశాలల్లో ‘ఈగల్‌ క్లబ్‌’లను ఏర్పాటు చేశారు. వీరి ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించి పొగాకు, మాదకద్రవ్యాలకు బానిసలైతే ఎటువంటి అనర్థాలు ఎదురవుతాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన, ఛైతన్య ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టడానికి పోలీసులు పలు నిఘాను పటిష్ఠం చేశారు. వీటిని రవాణా చేయడంతోపాటు విద్యార్థులకు చేరవేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. మాదకద్రవ్యాలతో పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు. మాదకద్రవ్యాలను రవాణా చేస్తూ పలుమార్లు పట్టుబడిన నిందితుల ఆస్తుల జప్తునకు కూడా వెనుకాడేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అందుబాటులోకి ట్రోల్‌ఫ్రీ నంబర్‌

డ్రగ్స్‌ సంబంధిత సమాచారాన్ని అందించేందుకు పోలీసు శాఖ 1972 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాదకద్రవ్యాల రవాణాపై సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పదేపదే గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారిపై పీఐటీఎన్‌డీపీఎస్‌ చట్టాన్ని ప్రయోగించి రిమాండ్‌కు పంపారు.

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

సుమారు ఏడాది నుంచి అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో గంజాయి సాగు పూర్తిగా తగ్గిపోయింది. అయితే పక్కనే వున్న ఒడిశాలో సాగు చేస్తుండడంతో స్మగ్లర్లు అక్కడ కొనుగోలు చేసి అల్లూరి, అనకాపల్లి జిల్లాల మీదుగా ఇతర జిల్లాలు/ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. జిల్లా మీదుగా గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించడానికి పోలీసులు నర్సీపట్నం, మాడుగుల, చీడికాడ, గొలుగొండ, దేవరాపల్లి మండలాల్లో శాశ్వత చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇంకా వివిధ మండలాల్లో 38 ప్రదేశాల్లో వాహనాల తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 15వ తేదీ వరకు వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధిలో 158 గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయి. 9,726 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 492 మందిని అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన 145 వాహనాలను సీజ్‌ చేశారు. అనకాపల్లిని మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందించాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా కోరుతున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:39 AM