Share News

అపరాలకు స్వస్తి... మొక్కజొన్నపై ఆసక్తి

ABN , Publish Date - Mar 05 , 2026 | 10:31 PM

జిల్లాలోని రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అపరాల సాగు కంటే అధిక ఆదాయం వస్తుండడంతో మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.

 అపరాలకు స్వస్తి... మొక్కజొన్నపై ఆసక్తి
కొయ్యూరు మల్లికార్జునస్వామి చెక్‌డ్యాం కింద ఆయకట్టు భూముల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న

అధిక ఆదాయం వస్తుండడంతో మొగ్గు చూపుతున్న రైతులు

జిల్లా వ్యాప్తంగా రెండేళ్ల క్రితం వరకు 15,500 ఎకరాల్లో సాగు

ఈ ఏడాది 30 వేల ఎకరాలకు విస్తరణ

కోళ్లు, చేపల దాణాకు వినియోగిస్తుండడంతో డిమాండ్‌

ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం

కొయ్యూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అపరాల సాగు కంటే అధిక ఆదాయం వస్తుండడంతో మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 15,500 ఎకరాల్లో సాగు చేసే మొక్కజొన్న ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారంటే ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

జిల్లాలో రైతాంగం మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపిస్తుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మొక్కజొన్నకు ఎకరాకు పెట్టుబడులు పోనూ రూ.30 వేలు ఆదాయం వస్తుండడంతో దీని సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు మండల వ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు అనంతరం కంది, పెసర, మినుము, రాజ్‌మా వంటి పప్పు దినుసుల సాగు విస్తారంగా కనిపించేది. అటువంటిది ఇప్పుడు వాటి స్థానంలో మొక్కజొన్న సాగు దర్శనమిస్తున్నది. గత రెండు సంవత్సరాల క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా సాగునీటి వసతి ఉన్న భూముల్లో సుమారు 15,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసేవారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 30 వేల ఎకరాలకు చేరింది. మొక్కజొన్నను కోళ్లఫారాలు నిర్వహించేవారు, అలాగే చేపల పెంపకానికి దాణాగా వినియోగిస్తుండడంతో డిమాండ్‌ పెరిగింది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే ఎకరాకు కేవలం రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్యలో అవుతుండగా, దిగుబడి ద్వారా ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్యలో ఆదాయం వస్తోంది. దీంతో జిల్లాతో పాటు మండలంలోనూ మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా గత సంవత్సరం స్వల్పంగా సాగు చేసే మొక్కజొన్న ఈ సంవత్సరం కొయ్యూరు, మంప, రేవళ్లు, మర్రివాడ, తదితర పంచాయతీల్లో సుమారు 1,500 ఎకరాలకు ఈ సాగు విస్తరించింది. ముఖ్యంగా సాగునీటి వసతి గల మల్లికార్జునస్వామి చెక్‌డ్యాం, చీడిపాలెం చెక్‌డ్యాం కింది ఆయకట్టు భూములతో పాటు బోర్లు ఉన్న భూముల్లో మొక్కజొన్న సాగుకు రైతాంగం ఉపక్రమించారు.

ప్రోత్సహిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం

గతంలో ఆహార అవసరానికి ఈ మొక్కజొన్నను సహజసిద్ధంగా లభించే ఎరువులు వినియోగించి సాగు చేసేవారు. ప్రస్తుతం వాణిజ్య అవసరాలకు పండించడంతో మొక్కజొన్నను అధిక దిగుబడులు వచ్చే హైబ్రీడ్‌ విత్తనాలను వినియోగించి సాగు చేస్తున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతం మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉండడం ధర సైతం పెరిగి రైతుకు మంచి ఆదాయం వస్తోంది. అయితే దీని సాగు మరింత విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికి ఈ ప్రాంత రైతులకు ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహం అందడం లేదు. మొక్కజొన్న ఖండి నుంచి గింజలు వేరు చేసేందుకు యంత్రాలు వినియోగిస్తే సులువుగా పని అవుతుంది. ఆ తరహా యంత్రాలు రాయుతీపై అందించేలా సంబంధిత వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టడం లేదు. అలాగే మేలిరకం విత్తనాలు రాయితీపై అందిస్తే ఈ సాగు చేసే రైతులను మరింత ప్రోత్సహించినట్టు అవుతుంది. వేసవి ఆరంభంలో సాగు చేసే ఈ పంటకు సాగునీటి సరఫరాకు అవసరమైన వాటర్‌ ఇంజన్లు, పైపులు, తదితర సామగ్రిని రాయితీపై సరఫరా చేసేలా ఐటీడీఏ చర్యలు చేపడితే మొక్కజొన్న సాగు ప్రస్తుతం జరుగుతున్న దానికి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా వేసవిలో జీవనోపాధికి వలసలు వెళ్లేవారికి స్థానికంగా ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా డిసెంబరు నుంచి తిరిగి జూలై వరకు పశువులను వదిలేయడం వలన అన్ని వసతులు ఉన్న సాగు భూములు బీడులుగా మారుతున్నాయి. మొక్కజొన్న సాగు విస్తీర్ణం మరింత పెరిగితే పశువుల కట్టడి జరుగుతుంది. ఈ విషయాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న మొక్కజొన్న సాగును అన్ని విధాల ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 10:31 PM