తర్జన భర్జనకు తెర!
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:57 PM
జిల్లా పరిషత్ కార్యాలయం వసతిపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు సోమవారం తెరపడింది. స్థానిక పాతపాడేరులో ఉన్న సామాజిక భవనంలోనే జడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
పాతపాడేరు సామాజిక భవనంలోనే జడ్పీ కార్యాలయం
తొలుత కాఫీ హౌస్‌లో ఆఫీసు ఏర్పాటుకు ప్రయత్నం... అంగీకరించని ఐటీడీఏ అధికారులు
25 నుంచి నూతన జడ్పీ కార్యాలయంలో కార్యకలాపాల ప్రారంభానికి సన్నాహాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లా పరిషత్ కార్యాలయం వసతిపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు సోమవారం తెరపడింది. స్థానిక పాతపాడేరులో ఉన్న సామాజిక భవనంలోనే జడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
జిల్లా పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల గడువు ఈ నెల 24వ తేదీతో ముగియనుండడంతో ఆ తరువాత నుంచి కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి జీవో:114ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 25 నుంచి కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌ల కార్యకలాపాలు కొనసాగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పాతపాడేరులోనే జడ్పీ కార్యాలయం
స్థానిక పాతపాడేరులోనే జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్ కార్యాలయాల ఏర్పాటులో భాగంగా స్థానిక కాఫీ హౌస్‌లోనే దానిని ఏర్పాటు చేయాలని అధికారులు తొలుత భావించారు. అయితే ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉండే కాఫీహౌస్‌ను జడ్పీ కార్యాలయానికి ఇస్తే గిరిజన సంక్షేమానికి సంబంధించిన సమావేశాలు, అతిథులకు ఆఽథిత్యం ఇచ్చేందుకు వసతి సమస్య ఏర్పడుతుందని దానిని వదులుకునేందుకు ఐటీడీఏ అధికారులు అంగీకరించలేదు. దీంతో జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం ఏర్పాటుకు అనువుగా ఉండే భవనాలను అధికారులు అన్వేషించారు. ఈ క్రమంలో స్థానిక పాతపాడేరులో 2010లో అప్పటి ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు ఎంపీ ల్యాడ్స్‌తో నిర్మించిన సామాజిక భవనాన్ని గుర్తించారు. గతంలో గ్రామ సచివాలయాన్ని నిర్వహించిన ఈ సామాజిక భవనం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీంతో అందులోనే తాత్కాలికంగా జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ నెల 25 నుంచి అందులోనే నూతన జడ్పీ కార్యాలయం కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.