ఇళ్ల నిర్మాణాలకు మంగళం?
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:36 AM
నగర శివారులో అభివృద్ధిచేసిన 65 లేఅవుట్‌లలోని సెంటు భూమిలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.
హౌసింగ్ కార్పొరేషన్‌లో నిధులు కేంద్ర ఖాతాకు
ఇక నుంచీ లబ్ధిదారుల ఖాతాకు నేరుగా బిల్లులు
పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
విశాఖపట్నం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి):
నగర శివారులో అభివృద్ధిచేసిన 65 లేఅవుట్‌లలోని సెంటు భూమిలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా పనుల్లో పురోగతి లేకున్నా హౌసింగ్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అప్పటివరకు చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కేంద్రం ఇళ్ల నిర్మాణాలకు మంజూరుచేసిన డబ్బు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ సంస్థ ఖాతాలోని రూ. 160 కోట్లు కేంద్ర ఖాతాకు జమచేశారు. దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు నిలిపివేశారు.
స్వయంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారుల ఖాతాకు సొమ్ములు జమచేస్తామని చెబుతున్న కేంద్రం, మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రానికి పంపనున్నది. ఈ విషయంలో గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారులు చొరవ తీసుకోకపోవడంతో సెంటు భూమిలో ఇళ్ల పథకానికి గ్రహణం పట్టిందనే వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో సెంటు భూమిలో ఇళ్ల నిర్మించే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించారు. నగర శివారులోని 65లేఅవుట్లలో 1,40,798 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. 1,14,821 మందికి ఇళ్లు కేటాయించగా 80,833 ఇళ్లు మంజూరుచేశారు. ఇప్పటివరకు సుమారు 36 వేల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించారు. మరో 45వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
ఆరోపణలపై విచారణ
సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. దీని వల్ల కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరులో జాప్యం జరిగింది. ఇది అంతిమంగా పనులపై ప్రభావం చూపింది. జిల్లాలోని పలు లేఅవుట్‌లలో పనులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాంట్రాక్టర్లు, కిందిస్థాయి అధికారులు మిలాఖత్ అయి భారీగా మెటీరియల్ పక్కదారి పట్టించారని, కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిర్మాణాలు కాసులు కురిపించాయనే విమర్శలున్నాయి. ఇద్దరు, ముగ్గురు కిందిస్థాయి అధికారులు రూ.కోట్లలో అవినీతికి పాల్పడ్డారని సమాచారం. వీటన్నింటి ప్రభావంతో బిల్లుల మంజూరులో ఉన్నతాధికారులు ఆచితూచి వ్యవహరించడంతో పనుల్లో పురోగతి కనిపించలేదు.
కేంద్రం అసంతృప్తి
ఇళ్ల నిర్మాణాలకు గతంలో ఇచ్చిన గడువును కేంద్రం రెండుమూడు సార్లు పెంచింది. చివరకు ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు ఇచ్చింది అయితే గతంలో ఇచ్చిన నిధులు ఖర్చుచేయకపోడంతో అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన నిధులు వెనక్కి పంపాలని ఆదేశించడంతో తాజాగా హౌసింగ్ శాఖ సుమారు రూ.160 కోట్లను జమచేసింది. ఇక నుంచీ చేపట్టే పనులకు సంబంధించిన బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాకు మాత్రమే జమచేస్తారు. ఈ నేపథ్యంలో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి వెనక్కి పంపిన నిధులు తిరిగివచ్చేలా చూడడంతోపాటు బిల్లులు కాంట్రాక్టర్ల ఖాతాకు జమచేసేలా ఆదేశాలు ఇప్పించాలని, లేదంటే సెంటు భూమిలో నిర్మాణాలు నిలిచిపోతాయం టున్నారు. నగరంలోని ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు ఆయా లేఅవుట్‌లకు వెళ్లి నిర్మాణాలు చేపట్టడం సాధ్యంకాదంటున్నారు.