విరగ్గాసిన అవకాడో
ABN , Publish Date - Oct 04 , 2026 | 10:58 PM
మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం గ్రామంలో ఒక గిరిజనుడు సాగు చేస్తున్న అవకాడో మొక్కలు అధిక దిగుబడిని ఇస్తున్నాయి. అవకాడోలు కొనుగోలు చేసేందుకు స్థానికులు, మైదాన ప్రాంతీయులు ఆసక్తి చూపుతున్నారు.
యర్రవరం గ్రామంలో అధిక దిగుబడులు
కిలో రూ.150కు విక్రయం
చింతపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం గ్రామంలో ఒక గిరిజనుడు సాగు చేస్తున్న అవకాడో మొక్కలు అధిక దిగుబడిని ఇస్తున్నాయి. అవకాడోలు కొనుగోలు చేసేందుకు స్థానికులు, మైదాన ప్రాంతీయులు ఆసక్తి చూపుతున్నారు. రైతు కిలో అవకాడోలను రూ.150కు విక్రయిస్తున్నాడు.
యర్రవరం గ్రామానికి చెందిన గూడెపు వేణుగోపాల్‌రాజు ఆరేళ్ల క్రితం కడియం నుంచి 20 అవకాడో మొక్కలను కొనుగోలు చేసి గ్రామానికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం అవకాడో మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. గత ఏడాది నుంచి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఒకేసారి గుత్తులుగా కాయలు కాశాయి. ఒక్కొక్క మొక్క నుంచి 30-35 కిలో దిగుబడులు వచ్చాయి. ఒక్కొక్క కాయ 150 గ్రాములు నుంచి 200 గ్రాములు ఉంటుంది. కిలో రూ.150-160 ధరకు విక్రయిస్తున్నాడు. కాగా అవకాడో సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వీబీ జీ రామ్‌జీ ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మూడేళ్లపాటు సాగు ప్రోత్సాహకాలను అందజేస్తుంది. దీంతో గిరిజన రైతులు సైతం అవకాడో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అవకాడోలో అత్యంత విలువైన పోషక విలువలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చేసే మేలును గుర్తించిన ప్రజలు ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అవకాడో పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గిరిజన ప్రాంతంలో అవకాడోలు ఏపుగా పెరగడంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవకాడో ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం రావడం వల్ల స్థానికులు, మైదాన ప్రాంతీయులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.