Share News

అధ్వాన దారిలో అవస్థల ప్రయాణం

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:12 PM

మండలంలోని జీకేవీధి- చిన్నఅగ్రహారం రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు.

అధ్వాన దారిలో అవస్థల ప్రయాణం
తీములబంద రహదారిపై ఏర్పడిన గోతులు

జీకేవీధి- చిన్నఅగ్రహారం రోడ్డు గోతులమయం

గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణం

అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్‌ నాణ్యత పాటించకపోవడంతో ఇబ్బందులు

పలు గ్రామాల ప్రజలకు తప్పని రవాణా కష్టాలు

గూడెంకొత్తవీధి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జీకేవీధి- చిన్నఅగ్రహారం రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతాయనే ఉద్దేశంతో సర్వీసు వాహనాలను యజమానులు నిలిపివేశారు. దీంతో పలు గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు.

గూడెంకొత్తవీధి మండల కేంద్రం నుంచి చిన్నఅగ్రహారం వరకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారిని గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, సంబంధితశాఖ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నిర్మాణాలు పూర్తి చేసిన మూడో ఏట నుంచే రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. సకాలంలో రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల వర్షాలకు రహదార పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రస్తుతం రహదారిపై అడుగు, అడుగున్నర లోతు గోతులు ఏర్పడ్డాయి. పలు చోట్ల రహదారి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈ రహదారిపై జీకేవీధి పంచాయతీ పరిధిలో ఉన్న 17 గ్రామాల గిరిజనులు, కొయ్యూరు, పోలవరం జిల్లాకు చెందిన 22 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సదుపాయం లేదు. కేవలం ప్రైవేటు సర్వీసు ఆటోలు, జీపులు మాత్రమే తిరుగుతాయి. రహదారి పూర్తిగా పాడైపోవడంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని యజమానులు సర్వీసు వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆదివాసీలు వ్యక్తిగత వాహనాలు, కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. జీకేవీధి- చిన్నఅగ్రహారం రహదారి మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంత ఆదివాసీలు పలు మార్లు మండల, జిల్లా స్థాయి అధికారులకు అర్జీలు ఇచ్చారు. అయితే ఎవరూ స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించి ఈ రహదారిని బాగు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:12 PM