Share News

అక్విడక్టు అద్భుతం

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:58 AM

పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి జిల్లాలో కీలకమైన వరహా నదిపై అక్విడక్టు నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. అత్యంత క్లిష్టమైన ఈ పనుల్లో దాదాపు 92 శాతం పూర్తయ్యాయి. సెప్టెంబరు నెలాఖరునాటికి మిగిలిన పనులు పూర్తచేస్తామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

అక్విడక్టు అద్భుతం
పోలవరం ఎడమ కాలువకు అనుసంధానంగా వరహా నదిపై నిర్మించిన అక్విడక్టు

పోలవరం ఎడమ కాలువపై దార్లపైడి వద్ద వరహా నదిపై భారీ కట్టడం

పొడవు 1,125 మీటర్లు, వెడల్పు 42 మీటర్లు, ఎత్తు 5.5 మీటర్లు

ఒక్కొక్కటి ఆరు మీటర్ల వెడల్పుతో ఆరు ఖానాలు

188 పిల్లర్లపై అక్విడక్టు నిర్మాణం

గరిష్ఠ నీటి ప్రవాహ సామర్థ్యం ఆరు వేల క్యూసెక్కులు

నిర్మాణ వ్యయం రూ.138 కోట్లు

వచ్చే నెలాఖరునాటికి పూర్తి

ఎస్‌.రాయవరం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి జిల్లాలో కీలకమైన వరహా నదిపై అక్విడక్టు నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. అత్యంత క్లిష్టమైన ఈ పనుల్లో దాదాపు 92 శాతం పూర్తయ్యాయి. సెప్టెంబరు నెలాఖరునాటికి మిగిలిన పనులు పూర్తచేస్తామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువను జిల్లాలో మూడు ప్యాకేజీలుగా విభజించిన విషయం తెలిసిందే. పాయకరావుపేట పట్టణంలో తాండవ నది వద్ద నుంచి (ఇక్కడ నదిపై నిర్మించిన అక్విడక్టు కాకుండా..) ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వద్ద వరహా నది సరిహద్దు వరకు ఆరో నంబరు ప్యాకేజీ కింద, వరహా నదిపై కిలోమీటరు పైగా అక్విడక్టు నిర్మాణాన్ని 7ఏ ప్యాకేజీ కింద, అక్విడక్టు చివరి నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు ఏడో ప్యాకేజీ కింద, తాళ్లపాలెం నుంచి కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఏలేరు కాలువ) వరకు ఎనిమిదో ప్యాకేజీ కింద విభజించారు. పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు కాలువకు సంబంధించి వివిధ రకాల పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ప్రధానమైన వరహా నదిపై అక్విడక్టు నిర్మాణం ఒక యజ్ఞంలా సాగింది. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి, ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామాల మధ్య, వరహా నదిపై రూ.138 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ అక్విడక్టు పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. 1,125 మీటర్ల పొడవు, 42 మీటర్ల వెడల్పు, ఐదున్నర మీటర్ల ఎత్తున దీనిని నిర్మిస్తున్నారు. నదిపై మొత్తం 188 పిల్లర్లు వేశారు. నీటి ప్రవాహం కోసం ఒక్కొక్కటి ఆరు మీటర్ల వెడల్పుతో ఆరు ఖానాలు నిర్మించారు. వీటిద్వారా సుమారు ఆరు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేలా డిజైన్‌ చేశారు. ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది వాహనాల రాకపోకల కోసం అక్విడక్టు కుడి, ఎడమ వైపున ఒక్కో ఖానాపై శ్లాబ్‌ వేశారు. మిగిలిన నాలుగు ఖానాలను ఓపెన్‌గా వుంచేశారు. అక్విడక్టు కుడివైపున చివరి ఖానా పైభాగంలో కాంక్రీట్‌ గోడ నిర్మాణ పనులు చివరి దశలో వున్నాయి. ఈ నెల 14వ తేదీన కాలువకు నీటిని విడుదల చేస్తారన్న సమాచారంతో అక్విడక్టు వద్ద పనులు పూర్తికాని మూడు ఖానాలను (కాలువ నుంచి నీరు అక్విడక్టులోకి ప్రవేశించేచోట) ప్రాజెక్టు అధికారులకు గ్రావెల్‌తో తాత్కాలికంగా మూసివేశారు. మిగిలిన మూడు ఖానాల్లో నుంచి నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 14వ తేదీన పోలవరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి, సీఎం చంద్రబాబునాయుడు పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో పాల్గొనాల్సి వుంది. అయితే తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో జాతీయ రహదారిని క్రాస్‌ చేసేచోట్ల పనులు పూర్తి కాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. దార్లపూడి వద్ద అక్విడక్టు నిర్మాణం, ఇరువైపులా కాలువతో అనుసంధానం, అదే విధంగా అక్విడక్టు నుంచి వరహా నదిలోకి నీటిని విడుదల చేయడానికి నిర్మిస్తున్న రెగ్యులేటర్‌ పనులు వచ్చే నెలాఖరునాటికి పూర్తవుతాయని ప్రాజెక్టు డీఈ భాస్కర రామకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Aug 05 , 2026 | 12:58 AM