కంపెనీల ఒప్పందాల్లో సవరణలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:22 AM
విశాఖపట్నం జిల్లా పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సేల్ అగ్రిమెంట్లన్నీ సేల్ డీడ్‌లుగా మార్పు
అదానీ ఇన్‌ఫ్రా, రైడెన్ ఇన్ఫోటెక్, టీసీఎస్‌లకు షరతుల సడలింపు
పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి గడువు పెంపు
కొత్తగా క్రెడన్స్ రియాల్టీ సంస్థ, ఫ్యుజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, శ్రీటెక్ డేటా లిమిటెడ్, ఐస్ర్పౌట్ సంస్థలకు భూములు
నగరంలో గల ఆర్సెలార్ మిట్టల్ విస్తరణకు పచ్చజెండా
మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం జిల్లా పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో ఐటీ కంపెనీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని గతంలో వారితో చేసుకున్న ఒప్పందాల్లో మార్పులు చేశారు. ఆయా కంపెనీలకు కేటాయించిన భూములకు గతంలో ‘సేల్ అగ్రిమెంట్’ మాత్రమే చేశారు. అంటే వాటిపై కంపెనీలకు హక్కులు ఉండవు. ఇప్పుడు వారికి హక్కులు కలిగేలా ఆయా భూములు పూర్తిగా వారికి దఖలు పడేలా సేల్ అగ్రిమెంట్‌ను ‘సేల్ డీడ్’గా మార్చడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒప్పందం జరిగినప్పుడు పెట్టిన షరతుల్లో కొన్నింటిని సడలించడానికి కూడా అంగీకారం తెలిపింది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో భారీ విస్తీర్ణంలో నిర్మిత స్థలం కేటాయించారు. దానిని సెజ్ నుంచి డీనోటిఫై కూడా చేశారు. అదే కొండపై ఏపీఐఐసీకి చెందిన 21.6 ఎకరాలను ఎకరా కేవలం 99 పైసలకే ఇస్తూ సేల్ అగ్రిమెంట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని షరతులు పెట్టారు. అయితే సేల్ అగ్రిమెంట్ కాకుండా ఆ భూమిపై పూర్తి హక్కులు కలిగేలా సేల్ డీడ్ చేయాలని, షరతుల్లో కొన్నింటిని సవరించాలని కంపెనీ కోరగా, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫారసు మేరకు సరవణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
- ఆరిలోవ జంక్షన్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఇచ్చిన భూమిలో ఈ ఏడాదిలోనే అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. ఇంకో ఏడాది గడువు కావాలని కోరడంతో 2027 జూన్ వరకు అనుమతిస్తూ మంత్రివర్గం సిఫారసు చేసింది.
- విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ల ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లేందుకు కొన్ని సడలింపులు ఇవ్వాలని అదానీ ఇన్‌ఫ్రా, రైడెన్ ఇన్‌ఫోటెక్ ఇండియా లిమిటెడ్ కోరగా వాటికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారి భూములకు సేల్ అగ్రిమెంట్‌కు బదులు సేల్ డీడ్, ప్రోత్సాహకాల మార్పు, గతంలో ప్రభుత్వం షరతులతో జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేయడానికి ఆమోదం తెలిపారు.
- ఏపీఐఐసీకి, కె.రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్‌కు మధ్య జరిగిన సేల్ అగ్రిమెంట్‌లో కొన్ని నిబంధనల సవరణకు అనుమతించారు.
కాన్వెంట్ జంక్షన్‌లో ఐరన్‌ఓర్ పెల్లెట్ ప్లాంటు విస్తరణ
కాన్వెంట్ జంక్షన్‌లో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాకు చెందిన ఐరన్‌ఓర్ పెల్లెట్ ప్లాంటు విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఏడాదికి 7 మిలియన్ టన్నుల పెల్లెట్లు తయారవుతుండగా ఇకపై 11 మిలియన్ టన్నులు తయారు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి ఆ సంస్థ రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టి, 250 మందికి నేరుగా, 510 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. అయితే ఈ ప్లాంటు విస్తరణ వల్ల నగరంలో కాలుష్యం మరింత పెరుగుతుంది. గాలిలో ధూళికణాల సంఖ్య అధికం అవుతుంది.
కొత్త కంపెనీలకు భూములు
- క్రెడన్స్ రియాల్టీ సంస్థ విశాఖలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ముందుకువచ్చింది. రూ.386.88 కోట్ల పెట్టుబడితో 6,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది. దాంతో వారి ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ, ప్రోత్సాహాకాలు ఇవ్వడానికి అంగీకరించింది.
- ఫ్యుజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు రెండు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో రూ.425 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. కేటాయించిన భూమిలో ఐఓటీ క్యాంపస్ నిర్మిస్తారు.
- శ్రీటెక్ డేటా లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో రూ.1,800 కోట్ల పెట్టుబడితో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ముందుకురాగా వారికి 49 సెంట్ల భూమి కేటాయించారు.
- ఐటీ, ఐటీఈఎస్ స్పేస్, రిటైల్, రెసిడెన్షియల్, డేటా సెంటర్ల అభివృద్ధికి ఐస్ర్పౌట్ సంస్థకు 9.5 ఎకరాలు కేటాయించారు. అందులో రూ.626.9 కోట్లతో 12,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆ సంస్థ పేర్కొంది.