ఆదాయంలో ఏఎంసీ డీలా
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:09 AM
ఆదాయం విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చతికిల పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సెస్సు రాబడి బాగా తగ్గిపోయింది.
2025-26లో లక్ష్యం రూ.2.07 కోట్లు
వసూలైంది రూ.1.52 కోట్లు మాత్రమే
సెస్సు చెల్లించకుండా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం
ఆదాయంపై సిబ్బంది కొరత ప్రభావం
నర్సీపట్నం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఆదాయం విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చతికిల పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సెస్సు రాబడి బాగా తగ్గిపోయింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో బలిఘట్టం, గన్నవరం, రాచపల్లిలో చెక్‌పోస్టులు ఉన్నాయి. దీని పరిధిలో లైసెన్స్ తీసుకున్న ట్రేడర్లు 79 మంది ఉన్నారు. రోజుకు రూ.5 వేలు అంతకన్నా ఎక్కువ విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులు విక్రయిస్తే ఏఎంసీకి ఒక శాతం సెస్సు చెల్లించాలి. మార్కెట్ సెస్సు చెల్లించకుండా వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటే.. ఆయా చెక్‌పోస్టుల వద్ద అడ్డుకొని మార్కెట్ సెస్సు కట్టించుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ కమిటీకి సెస్సు రూపంలో రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల ఆదాయ లక్ష్యం కాగా రూ.1.52 కోట్లు మాత్రమే వచ్చింది. ఇందులో బలిఘట్టం చెక్‌పోస్టు నుంచి రూ.40 లక్షలు, గన్నవరం చెక్‌పోస్టు ద్వారా రూ.37 లక్షలు, రాచపల్లి చెక్‌పోస్టు ద్వారా రూ.12 లక్షలు.. మొత్తం రూ.89 లక్షల ఆదాయం వచ్చింది. మార్కెట్ సెస్సు చెల్లించకుండా వ్యవసాయ ఉత్పత్తులను తరలిస్తున్న వ్యపారులపై ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.30 లక్షలు వసూలు చేశారు. మిగిలిన ఆదాయం ఇతర మార్గాల్లో వచ్చింది. ప్రభుత్వం విధించిన టార్గెట్‌లో 75 శాతం మాత్రమే వసూలైంది. అంతకుముందు సంవత్సరం (2024-25లో) నిర్దేశించిన లక్ష్యం రూ.2 కోట్లు లక్ష్యం కాగా అంతకుమించి రూ.2,04,37,001 ఆదాయం వచ్చింది.
సిబ్బంది కొరత..
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం పడిపోవడానికి తగినమంది సిబ్బంది లేక పోవడం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం ఏఎంసీ కార్యదర్శి, సూపర్‌వైజర్ మాత్రమే పర్మనెంట్ పోస్టులు ఉన్నాయి. సూపర్‌వైజర్ తీవ్రఅనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. ఇక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు, అంటెండరు, వాచ్‌మెన్ పోస్టులు (2) ఖాళీగా ఉన్నాయి. చెక్‌పోస్టు సిబ్బంది, వాచ్‌మెన్, డేటాఎంట్రీ ఆపరేటరు పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే లక్ష్యం మేరకు ఆదాయం వస్తుందని మార్కెటింగ్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇక ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసున్న మరో వంద మందిని అధికారులు గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు.