Share News

మొరాయిస్తున్న అంబులెన్స్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:21 AM

మండలంలోని మారుమూల పినకోట పీహెచ్‌సీ అంబులెన్స్‌ తరచూ మొరాయిస్తుండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించే క్రమంలో అంబులెన్స్‌ ఎక్కడ ఆగిపోతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

మొరాయిస్తున్న అంబులెన్స్‌
తరచూ ఆగిపోతున్న పినకోట పీహెచ్‌సీ అంబులెన్స్‌

మొరాయిస్తున్న అంబులెన్స్‌

- ఏడేళ్ల క్రితం పినకోట పీహెచ్‌సీకి పాతది కేటాయింపు

- తరచూ ఆగిపోతుండడంతో రోగుల అవస్థలు

అనంతగిరి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పినకోట పీహెచ్‌సీ అంబులెన్స్‌ తరచూ మొరాయిస్తుండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించే క్రమంలో అంబులెన్స్‌ ఎక్కడ ఆగిపోతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సుమారు ఏళ్ల క్రితం పినకోట పీహెచ్‌సీకి పాత అంబులెన్స్‌ను కేటాయించారు. సరైన నిర్వహణ లేక ఇది తరచూ మొరాయిస్తోంది. దీంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. కివర్ల, పెదకోట, పినకోట, జీనబాడు సచివాలయాల పరిధిలోని 72 గ్రామాల గిరిజనులు పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపైనే ఆధారపడతారు. కాగా నాలుగు రోజుల క్రితం కివర్ల పంచాయతీ పుతికపుట్టు గంగవరం గ్రామం నుంచి ఓ గర్భిణిని పినకోట అంబులెన్స్‌లో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో గల దేవరాపల్లి మండల కేంద్రానికి వచ్చేసరికి ఆగిపోయింది. దీంతో 108 వాహనంలో గర్భిణిని తరలించారు. సోమవారం దాయర్తి గ్రామానికి చెందిన వంతల మాలతి అనే గిరిజనుడికి వడదెబ్బ తగిలి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు పినకోట అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేయగా మరమ్మతులకు గురైందని తెలిసింది. తరచూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని రోగులు వాపోతు న్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్పందించి పినకోట పీహెచ్‌సీకి కొత్త అంబులెన్స్‌ కేటాయించాలని 72 గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:21 AM