జయహో అమరావతి
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:07 AM
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో గురువారం జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి.
రాజధానికి చట్టబద్ధతతో జిల్లాలో సంబరాలు
విద్యుత్ దీపాలతో కళకళలాడిన కలెక్టరేట్, జీవీఎంసీ కార్యాలయం
జోనల్ కార్యాలయాల్లో ఉద్యోగుల వేడుకలు
దీపాలు వెలిగించి రాజధానికి స్వాగతం పలికిన ప్రజలు
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ర్యాలీలు
కేకులు కట్ చేసి, బాణసంచా కాల్చిన నేతలు
విశాఖపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో గురువారం జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి నేతలు, ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహించారు. దీపాలు వెలిగించి ఆనందం పంచుకున్నారు. కేకులు కట్ చేశారు. బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్, జీవీఎంసీ ప్రధాన కార్యాలయాలను గురువారం రాత్రి విద్యుద్దీపాలతో అలంకరించారు. జిల్లాలోని స్వర్ణ గ్రామ/వార్డు కార్యాలయాలు, ఎంపీడీవో, జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వసతిగృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మన రాజధాని అమరావతి పేరుతో వేడుకలు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, కోరాడ రాజబాబు తదితరులు కేకు కట్‌చేసి ‘మన రాజధాని అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. కార్యాలయం ఆవరణలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల మధ్య కేకు కట్‌చేసి బాణసంచా కాల్చారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని పల్లా పేర్కొన్నారు.
ఎంవీపీ కాలలో గల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద వేడుకలు జరిగాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుకు ఆమోదం తెలిపిన అన్ని పార్టీల నాయకులకు గంటా ధన్యవాదాలు తెలిపారు. జాతీయ జెండాలు చేతబట్టి, బాణసంచా కాల్చి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో గోపాలపట్నం నుంచి శ్రీహరిపురం వరకు మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి, రాజ్యాంగ విలువలతో ఈ విజయం సాధించామని పేర్కొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సారథ్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా అమరావతికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ‘మావిగన్’ పేరు పెట్టాలని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి దీపాలతో రాజధానికి స్వాగతం పలికారు. ఆదర్శనగర్‌లో అమరావతికి జై నినాదాలు చేశారు. రహదారిపై జై అమరావతి అని రాసి ముగ్గులతో అలంకరించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. దక్షిణ నియోజకవర్గం పరిధి జగదాంబ కూడలిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్ కేకు కట్ చేసి బాణసంచా కాల్చారు. గ్రీన్‌పార్కు వద్ద ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కలెక్టరేట్‌లోని స్వర్ణగ్రామం/స్వర్ణవార్డు జిల్లా ఇన్‌చార్జి సి.ఉషారాణి నేతృత్వంలో కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. ఆమె ఆదేశాల మేరకు జిల్లాలోని 607 కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల్లో సంబరాలు జరిగాయి. జగదాంబ జంక్షన్‌లో డ్వాక్రా మహిళలు అమరావతికి జై అంటూ ముగ్గులు వేశారు. జిల్లాలోని నాలుగు మండల పరిషత్ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో ‘నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-నా రాజధాని అమరావతి’ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు.
వాడవాడలా సంబరాలు
పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, రిసోర్స్‌పర్సన్లు, వార్డు సచివాలయాలు, జోనల్ కార్యాలయాల్లోని సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి తమ ఆనందాన్ని తెలియజేశారు. కొన్నిచోట్ల మహిళలు ‘రాజధాని అమరావతికి జై’ అని పేర్కొంటూ రంగవల్లులు వేసి తమ మద్దతును తెలియజేశారు. కొన్నిచోట్ల యువత బైక్‌ర్యాలీలు నిర్వహించి అమరావతి రాజధానిగా ప్రకటించడంపై సీఎం చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.