అభివృద్ధి బాటలో అల్లూరి స్మారకపార్కు
ABN , Publish Date - May 06 , 2026 | 12:32 AM
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సార్మక పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్కులో వివిధ రకాల పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తున్నారు.
రూ.20 లక్షలు మంజూరు చేయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
పగోడాలు, ఫ్లోరింగ్ టైల్స్, ప్రహరీ గోడలకు మరమ్మతులు
పలురకాల మొక్కలతో కళకళ
మరో రూ.15 లక్షలతో తాగునీటి బోరు, ఆడిటోరియం భవనానికి మరమ్మతులు
కృష్ణాదేవిపేట, మే 5 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సార్మక పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్కులో వివిధ రకాల పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అల్లూరి స్మారక పార్కు అభివృద్ధికి రూ.1.5 కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించిందే తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు రూ.20 లక్షలతో పార్కులో పలు అభివృద్ధి పనులు జరిగాయి. నాలుగు పగోడాలకు మరమ్మతులు చేశారు. విద్యుత్తు లైట్లు మార్చారు. నడక ప్రదేశాల్లో పాడైన టైల్స్ స్థానంలో కొత్తవి వేశారు. ప్రహరీ గోడ, ప్రవేశ ద్వారానికి మరమ్మతు చేశారు. మొక్కలకు నీటి సదుపాయంతోపాటు నిర్వహణ పనులు చేస్తుండడంతో ఆకర్షణీయంగా తయారయ్యాయి. దీంతో సందర్శకుల రాక పెరిగింది.
రూ.15 లక్షలతో మరికొన్ని పనులు
అల్లూరి స్మారక పార్కులో మరికొన్ని అభివృద్ధి పనులు చేయించడానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూ.15 లక్షలు మంజూరు చేయించారు. ఇందులో రూ.5 లక్షలతో తాగునీటి సదుపాయం కోసం సమీపంలోని మసీదు వద్ద బోరుబావి తవ్వారు. అక్కడి నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న పార్కు వరకు పైపులైన్ వేస్తున్నారు. మరో రూ.10 లక్షలతో అల్లూరి జీవిత చరిత్ర ఆడిటోరియం భవనానికి మరమ్మతులు చేస్తున్నారు.
ఈ పనులు కూడా చేస్తే..
గత ఏడాది అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడుతోపాటు హోం మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేశ్, పలువురు ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చారు. అల్లూరి స్మారక పార్కు అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని స్పీకర్ కోరగా.. పార్కులో జిమ్ ఏర్పాటుకు రూ.5 లక్షలు మంజూరు చేయిస్తానని మంత్రి అనిత హామీ ఇచ్చారు. పార్కులో క్యాంటీన్, డైనింగ్ హోల్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తానని ఎంపీ రమేశ్ చెప్పారు. కానీ ఇంతవరకు వీరి హామీలు అమలుకు నోచుకోలేదు.