శత శాతం సేంద్రీయ జిల్లాగా అల్లూరి
ABN , Publish Date - May 08 , 2026 | 10:44 PM
రానున్న రోజుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాను శతశాతం సేంద్రీయ జిల్లాగా మార్చాలని, అందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, అధికారులకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశం
ప్రభుత్వపరంగా సదుపాయలు కల్పిస్తామని హామీ
కలెక్టర్ మెంటార్ వ్యవహరించాలని సూచన
కాఫీ, ఉద్యాన పంటలు మరింతగా అభివృద్ధి
పాడేరు, మే 8 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాను శతశాతం సేంద్రీయ జిల్లాగా మార్చాలని, అందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అమరావతిలో శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల ఏడో సదస్సు రెండో రోజు సీఎం మాట్లాడుతూ జిల్లాలో కాఫీతోపాటు ఎక్కువ ఆదాయం వచ్చే ఇతర పంటలను ప్రోత్సహించాలని, వాటికి సేంద్రీయ ధ్రువీకరణ చేయాలన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పనిచేయాలన్నారు. జిల్లాను సంపూర్ణంగా సేంద్రీయ పంటల కేంద్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భవిష్యత్తులో అధిక ఆదాయం వచ్చే పంటల సాగుకు సంబంఽధించి అల్లూరి జిల్లా ఒక మోడల్‌గా ఉండాలన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు అల్లూరి జిల్లాకు వచ్చి తిలకించేలా చూడాలని, ఇందుకు కలెక్టర్ మెంటార్‌గా వ్యవహరించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. దేశంలోనే చక్కని గుర్తింపు పొందిన అరకు కాఫీని మరింతగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయిక్ స్పందిస్తూ ఇప్పటికే జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయని, తాజాగా మంజూరు చేసిన మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలోనే కాఫీ సాగు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని, మరో నాలుగేళ్లల్లో 3.5 లక్షల ఎకరాలకు చేరికతో రాష్ట్రం రెండో స్థానంలో ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ.. అధిక ఆదాయం వచ్చే అవకాడో, లిచ్చీ వంటి ఉద్యాన పంటల సాగుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే పంటల సాగుకు సంపూర్ణంగా ప్రోత్సహించాలని, కిచెన్ గార్డెన్లు, ఫ్రూట్ గార్డెన్లను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాలో కాఫీ, ఇతర పంటల సాగును అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటకాన్ని వాటికి అనుసంధానించాలని, ఆ దిశగా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో వాట్సాప్ గవర్నెన్స్‌లో వెనుకంజ
వాట్సాప్ గవర్ననెన్స్‌లో జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేదు. దీంతో రాష్ట్ర స్థాయిలో వాట్సాప్ గవర్నెన్స్‌లో జిల్లాకు 28వ ర్యాంక్ వచ్చింది. జిల్లాలో మారుమూల ప్రాంతాలు అధికంగా ఉండడంతోపాటు అనేక ప్రాంతాలకు సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల సంతృప్తి స్థాయి గత మూడు లేదా నెల రోజుల వ్యవధిలో నమోదు చేసినా 50 శాతం దాటకపోవడం గమనార్హం. దీంతో ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ప్రజల సంతృప్తి స్థాయిలోనూ 28వ ర్యాంక్ వచ్చింది. మీకోసం కార్యక్రమాన్ని నెలలో ఒకమారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో, తర్వాత మూడు మార్లు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించాలని సీఎం సూచించారు. ప్రధానమంత్రి జన్‌మన్ యోజనలో భాగంగా జిల్లాకు 149 అంగన్‌వాడీ కేందాలకు భవనాలు మంజూరు కాగా వాటిలో 6 భవనాలు మాత్రమే నిర్మాణ దశలో ఉండగా.. ఇంకా 143 భవనాల నిర్మాణం ప్రారంభం కాలేదు. అలాగే జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ నిర్మాణం సైతం పూర్తికాలేదు.