Share News

ఉద్యోగుల విభజన

ABN , Publish Date - Jul 17 , 2026 | 01:05 AM

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల విభజన పూర్తిచేసేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.

ఉద్యోగుల విభజన

రంగం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాలకు కేటాయింపు

ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రాతిపదికగా ముసాయిదా జాబితాలు రెడీ

నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

వచ్చే నెల ఐదో తేదీలోగా

కేటాయించిన చోట బాధ్యతల స్వీకరణ

విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల విభజన పూర్తిచేసేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. నెలాఖరుకు విభజన ప్రక్రియ పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శాఖల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు రూపొందించారు. విద్య, వైద్య, ఆరోగ్య, ప్రజా రవాణా శాఖలు మినహా మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించనున్నారు. ఈ ప్రక్రియలో అధికశాతం మంది ఉద్యోగులకు స్థాన చలనం తప్పదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల పాలనా వ్యవహారాల్లో భారీ కుదుపు వస్తుందని చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రతి శాఖలో పనిచేసే ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకుని రూపొందించిన ముసాయిదా జాబితాలు గురువారం రాత్రిలోగా ఆయా శాఖల కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంది. ముసాయిదా జాబితాపై ఈనెల 20వ తేదీలోగా ఉద్యోగుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 22 నాటికి తుది సీనియారిటీ జాబితాను విడుదలచేస్తారు. 26వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్‌ ఫారాలు స్వీకరిస్తారు. ఇందులో ప్రతి ఉద్యోగికి మూడు ఆప్షన్లు ఇస్తారు. అమలు సమయంలో ఎవరూ పోటీ లేకపోతే సదరు ఉద్యోగి కోరుకున్న చోటకు బదిలీచేస్తారు. అదే చోటుకు ఇతర ఉద్యోగులు పోటీపడితే సీనియారిటీ జాబితాను పరిగణనలోకి తీసుకుని కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా ఈనెల 28న ఉద్యోగులకు స్థానాలు కేటాయించి, ఉత్తర్వులు జారీచేస్తారు. 30వ తేదీన వారంతా కొత్త ప్రదేశాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. అయితే వచ్చేనెల ఐదోతేదీ వరకు వారికి అవకాశం కల్పిస్తారు.

మూడు జిల్లాలకు కేటాయింపు

ఉమ్మడి విశాఖ జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని శాఖల వారీగా రూపొందించిన సీనియారిటీ జాబితాల మేరకు ఉద్యోగులను మూడు జిల్లాలకు విభజిస్తారు. సాధారణంగా సీనియర్లు విశాఖ జిల్లాకే ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా కొన్ని కేటగిరీల ఉద్యోగులను విభజన నుంచి మినహాయిస్తారు. వీరిలో వితంతువులు, పిల్లలు లేదా భర్త/భార్య దీర్ఘకాల వ్యాధులతో బాఽధపడే ఉద్యోగులు, సదరం సర్టిఫికెట్‌లో 70 శాతం అంగవైకల్యం ఉన్న ఉద్యోగులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.

1,800 మంది రెవెన్యూ ఉద్యోగులు

ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ శాఖలో అటెండరు నుంచి తహశీల్దారు వరకు మొత్తం 1,800 మంది ఉద్యోగులు/అధికారులు ఉన్నారు. వీరంతా మూడు జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌, తహశీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రతి కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నుంచి వాచ్‌మన్‌ వరకు 85 మంది పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి కలెక్టరేట్‌లో డీఆర్వో, కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌, భూ సంస్కరణల పాలనాధికారి, నలుగురు తహశీల్దార్‌ కేడర్‌ అధికారులు ఉండాలి. ఇంకా 16 మంది డీటీలు, 16 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 10 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, 16 మంది ఆఫీస్‌ సబార్డినేట్‌లు, నలుగురు డ్రైవర్లు, ఇద్దరు వాచ్‌మన్లు, రికార్డు అసిస్టెంట్‌, జమేదార్‌ ఉండాలి. ఇప్పటివరకు కలెక్టరేట్‌ అవసరాలకు మండలాల నుంచి డీటీలను డిప్యూటేషన్‌పై తీసుకువస్తున్నారు. ఇక 16 మంది డీటీలను ప్రత్యేకంగా కేటాయించారు. తహశీల్దార్లు పోస్టులను మల్టీ జోన్‌ (జోన్‌ 1,2 కలిపి)గా పరిగణిస్తున్నారు. అంటే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాల్లో తహశీల్దార్లు ఎక్కడైనా ఆప్షన్‌ ఇచ్చుకునే అవకాశం ఉంది. డిప్యూటీ తహశీల్దార్లు జోన్‌-1లో అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో ఆప్షన్‌ కోరుకునే అవకాశం ఉంది.

జిల్లా పరిషత్‌లో 636 పోస్టులు

జిల్లా పరిషత్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని పలు కేడర్‌లలో 636 మంది ఉద్యోగులు/అధికారులు పనిచేస్తున్నారు. ఎంపీడీవోలు మల్టీ జోన్‌ పరిధిలోకి, డిప్యూటీ ఎంపీడీవోలు జోన్‌ పరిధిలోకి వస్తారు. మిగిలిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లా పరిధిలో బదిలీలకు అర్హులు.

పారదర్శకంగా ప్రక్రియ

ఉద్యోగుల విభజనలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత జిల్లా కేడర్‌ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లా, అనుబంధ జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌, అనుబంధ జోనల్‌కు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను దశలవారీగా చేపట్టాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, తుది కేడర్‌ బలాన్ని సమగ్రంగా పరిశీలించి, వివరాలు ఖరారు చేయాలన్నారు. అర్హులైన ఉద్యోగులందరికీ సీనియారిటీ జాబితాలో చోటు కల్పించాల్సిందేనన్నారు. విభజన సమయంలో ఏ ఉద్యోగీ మిగిలిపోకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఏవో బీవీరాణి, తదితరులు పాల్గొన్నారు.


గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్‌ మళ్లింపు

28, 29 తేదీల్లో నిబంధనల అమలు

హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వరకు నో ఎంట్రీ

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):

ఈ నెల 28, 29 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ ఉన్నందున ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టాలని, వాటిపై ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలని పోలీస్‌ శాఖకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నో వెహికల్‌ జోన్లు పెట్టాలని, ప్రత్యామ్నాయ మార్గాలపై సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృతం ప్రచారం చేయాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే వాహనాలను ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా మళ్లించాలన్నారు. కార్లు, బైక్‌లు షీలానగర్‌, నరవ మీదుగా అసకపల్లి వద్ద హైవేకు చేరుకునేలా చూడాలన్నారు.నగరంలో హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వరకు నో వెహికల్‌ జోన్‌గా ప్రకటించాలని ఆదేశించారు. బీచ్‌రోడ్డులో కురుపాం జంక్షన్‌ నుంచి అప్పుఘర్‌ వరకు కూడా నో వెహికల్‌ జోన్‌గా చేయాలన్నారు. ఈ ట్రాఫిక్‌ మళ్లింపులపై ప్రజలకు ముందుగానే సమాచారం అందేలా చూడాలన్నారు. 28న వీలైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. దీనిపై విద్యా శాఖతో చర్చించాలని జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌లకు ఆదేశించారు. గిరి ప్రదక్షిణ 32 కి.మీ. మార్గంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు. సమావేశంలో ఆర్‌డీఓలు సంగీత్‌ మాధుర్‌, దిలీప్‌ చక్రవర్తి, దేవదాయ, జీవీఎంసీ, ఆర్టీసీ, వైద్యారోగ్య, అగ్నిమాపక, విద్యుత్‌ , ఆర్‌ అండ్‌ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 01:05 AM