కూటమి సునామీ
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:31 AM
తనతోపాటు కూటమి పార్టీల నుంచి పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చిన విశాఖ ప్రజలకు రుణపడి ఉంటానని మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి అన్నారు.
లెక్కింపు ప్రారంభం నుంచి కూటమి అభ్యర్థిని ఆధిక్యం
ఏ దశలోనూ పోటీ ఇవ్వని వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణి
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించింది. మేయర్ స్థానాన్ని రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇక వార్డుల్లోనూ సత్తాచాటింది. మొత్తం 120 వార్డుల్లో 100కు పైగా చేజిక్కించుకుంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లాలో మొత్తం స్థానాలన్నీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిన కూటమి...అప్పటికీ ఇప్పటికీ ఎటువంటి తేడా లేదని నిరూపించింది. నాటి మాదిరిగానే నేడు కూడా విశాఖ ప్రజలు కూటమిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఘన విజయాన్ని కట్టబెట్టారు.
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసిన ముక్కా శ్రావణి...తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిని వరుదు కళ్యాణిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ కూటమి అభ్యర్థిని ఆధిక్యం కనబరచారు. వైసీపీ అభ్యర్థి ఏ దశలోనూ కనీసపోటీ ఇవ్వకలేకపోయారు. ఈనెల ఒకటో తేదీన జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 18,37,901 మందికిగాను 10,35,154 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మేయర్‌కు సంబంధించి తొలి రౌండ్‌లో 7,18,162 ఓట్లను లెక్కించారు. కూటమి అభ్యర్థిని శ్రావణికి 4,15,749 ఓట్లు, వైసీపీ అభ్యర్థిని వరుదు కళ్యాణికి 2,36,323 ఓట్లు రాగా, నోటాకు 5,400 వచ్చాయి. 22,666 ఓట్లు చెల్లలేదు. ఇతర అభ్యర్థులకు దాదాపు 25 వేల ఓట్లు పడ్డాయి. దీంతో మొదటి రౌండ్‌లో కూటమి అభ్యర్థికి 1,79,426 ఓట్ల ఆధిక్యం లభించింది. రాత్రి 12.30 గంటల సమయానికి తొమ్మిది లక్షల ఓట్లను లెక్కించగా, కూటమి అభ్యర్థిని ఆధిక్యం 2.5 లక్షలకు పెరిగినట్టు సమాచారం. అధికారిక వివరాలను వెల్లడించడంలో జాప్యం జరగడంతో నిర్ధారించడానికి అవకాశం లేకుండాపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అన్ని వార్డుల్లోనూ కూటమి మేయర్ అభ్యర్థికి మెజారిటీ వస్తుండడం, ఆధిక్యం కూడా భారీగా పెరిగిపోతుండడంతో వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయితే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు లెక్కింపు కేంద్రంలోనే ఉండడం కనిపించింది.
టీడీపీ నుంచి తొలి మహిళా మేయర్
ఫిజియో థెరపిస్ట్ నుంచి నగర ప్రథమ మహిళగా ఎదిగిన శ్రావణి
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ అభ్యర్థినిగా కూటమి తరపున పోటీ చేసిన ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారు. జీవీఎంసీ చరిత్రలో టీడీపీ తరపున మేయర్ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నారు.
శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఇక వృత్తి రీత్యా ఫిజియో థెరపిస్ట్ అయిన శ్రావణి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కొనసాగాలని నిర్ణయించుకుని 2015 నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2021 ఎన్నికల్లో 26వ వార్డు (అక్కయ్యపాలెం ప్రాంతం) నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు కృషిచేశారు. తాజా ఎన్నికల్లో ఆమెను పార్టీ మేయర్ అభ్యర్థినిగా ఎంపిక చేసింది. తాను విజయం సాధిస్తే మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ, వీధి వ్యాపారులకు అండగా నిలవడం, సుస్థిర పట్టాణాభివృద్ధి, పట్టణ గృహ వసతి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రచారంలో హామీ ఇచ్చారు.
నగర ప్రజలకు రుణపడి ఉంటా
అఖండ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
విశాఖను నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా
ఈ పదవిని బాధ్యతగా భావిస్తా
మేయర్‌గా విజయం సాధించిన ముక్కా శ్రావణి
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
తనతోపాటు కూటమి పార్టీల నుంచి పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చిన విశాఖ ప్రజలకు రుణపడి ఉంటానని మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి అన్నారు. ఎన్నికల ఫలితాలు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖను నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తానన్నారు. తమ కుటుంబం ముప్పై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉందన్నారు. ఈ క్రమంలో తమపై విశ్వాసంతో పార్టీ గొప్ప అవకాశాన్ని కల్పించిందన్నారు. విశాఖపట్నం ఎప్పుడూ టీడీపీకి కంచుకోటగా ఉంటోందని, సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతోనే మరోసారి అఖండ మెజారిటీ అందించారని ఆమె పేర్కొన్నారు. దీనిని తాము బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కూటమి పార్టీల్లో ఉన్న అనుభవజ్ఞులైన నాయకుల సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. మీ ఇంటి ఆడపిల్లగా తనను ఆదరించి, ఆశీర్వదించాలని ప్రచారంలో కోరానని, నగర ప్రజలు తమ కుటుంబ సభ్యురాలిగా భావించి అఖండ మెజారిటీని అందించినందుకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు.