Share News

అనకాపల్లిలో కూటమి ప్రభంజనం

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:52 AM

పట్టణాల్లోనే కాదు...గ్రామీణ ప్రాంతంలోనూ తమకు తిరుగులేదని కూటమి మరోసారి నిరూపించింది.

అనకాపల్లిలో కూటమి ప్రభంజనం

మొత్తం 24 జడ్పీటీసీ స్థానాలూ కైవసం

తెలుగుదేశం-17 జనసేన-5 బీజేపీ-2 స్థానాల్లో గెలుపు

పూర్తిగా చతికిలపడిన వైసీపీ

425 ఎంపీటీసీలకుగాను 342 స్థానాల్లో కూటమి విజయం

అనకాపల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

పట్టణాల్లోనే కాదు...గ్రామీణ ప్రాంతంలోనూ తమకు తిరుగులేదని కూటమి మరోసారి నిరూపించింది. అనకాపల్లి జిల్లాలో మొత్తం 24 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం 17, జనసేన ఐదు, భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అనకాపల్లి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి 16,261 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయదుందుభి మోగించగా, నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి అత్యల్పంగా 1,105 మెజారిటీతో గెలుపొందారు. మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల్లోనూ (ఎంపీటీసీలు) కూటమి ఘన విజయం సాధించింది. జిల్లాలో మొత్తం 427 ఎంపీటీసీ స్థానాలకుగాను కూటమి 342 స్థానాలను (80 శాతం) కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీకి 248, జనసేనకు 86, బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష వైసీపీ 74 సీట్లతో (17.33 శాతం) మూడో స్థానానికి పరిమితం అయ్యింది. స్వతంత్ర అభ్యర్థులు 11 స్థానాల్లో గెలిచారు.


మన్యంలో వైసీపీ ఆధిక్యం

11 జడ్పీటీసీ స్థానాల్లో ఏడింట విజయం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 11 జడ్పీటీసీల్లో 7, 172 ఎంపీటీసీల్లో 85 స్థానాలను గెలుచుకుంది. దీంతో జిల్లాలోని అధిక మండలాల్లో ఎంపీపీ పదవులను సైతం వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో గిరిజన ప్రాంతంలో ఆ పార్టీకి ఉన్న పట్టు మరోమారు రుజువైంది. కాగా తాజా ఎన్నికల్లో కూటమి పార్టీలు సైతం ఒక మోస్తరుగా పుంజుకోవడం విశేషం. మూడు జడ్పీటీసీ, సుమారు 57 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది.


మాజీ ఎంపీ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ల ఓటమి

పాడేరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి సీతారామరాజు జడ్పీ చైర్మన్‌ రేస్‌లో ఉన్న వైసీపీకి చెందిన ఇద్దరు ప్రముఖులు గొడ్డేటి మాధవి, జల్లిపల్లి సుభద్ర ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు నుంచి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ముంచంగిపుట్టు నుంచి జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీకి దిగారు. అయితే కొయ్యూరులో టీడీపీ అభ్యర్థి మొట్టడం హిమబిందు చేతిలో మాధవి, ముంచంగిపుట్టులో సీపీఎం అభ్యర్థి కొర్రా త్రినాథ్‌ చేతిలో సుభద్ర ఓటమి పాలయ్యారు.

Updated Date - Nov 08 , 2026 | 01:52 AM