చోడవరంలో సత్తాచాటిన కూటమి
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:28 AM
ఇటీవల జరిగిన జల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో కూటమి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించి, సత్తా చాటింది.
నాలుగు జడ్పీటీసీల్లో విజయకేతనం
అన్ని మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీలు కైవసం
మొత్తం స్థానాలు 78
టీడీపీ 51, జనసేన, 11, బీజేపీ 1
నాలుగు ఎంపీపీ పదవులూ తెలుగుదేశం పార్టీకే?
చోడవరం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):
ఇటీవల జరిగిన జల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో కూటమి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించి, సత్తా చాటింది. మొత్తం నాలుగు జడ్పీటీసీలతోపాటు అన్ని ఎంపీపీ పదవులను కైవసం చేసుకునే స్థాయిలో ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది.
చోడవరం నియోజకవర్గంలోని చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాల్లో 78 ఎంపీటీసీ స్థానాలు వున్నాయి. వీటిలో ఏకంగా 63 స్థానాల్లో కూటమి గెలుపొందింది. ప్రతిపక్ష వైసీపీ 15 స్థానాలతో సరిపెట్టుకుంది. కూటమి సాధించిన 63 ఎంపీటీసీలలో 51 స్థానాలు తెలుగుదేశం పార్టీవే కావడం విశేషం. జనసేనకు 11 ఎంపీటీసీలు, బీజేపీకి ఒకటి దక్కాయి. చోడవరం నియోజకవర్గంలో వైసీపీకి వచ్చిన 15 ఎంపీటీసీ స్థానాల్లో 11 స్థానాలు బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల్లోనే వుండడం గమనార్హం.
చోడవరం మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలకుగాను కూటమికి 22 స్థానాలు దక్కాయి. వీటిలో టీడీపీ 16, జనసేన 5, బీజేపీ 1 స్థానాల్లో గెలుపొందాయి. 2021లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచిన వైసీపీకి ఈసారి మూడు స్థానాలు మాత్రమే లభించాయి. రోలుగుంట మండలంలో 14 ఎంపీటీసీల్లో టీడీపీకి 11, జనసేనకు రెండు వైసీపీకి ఒకటి వచ్చాయి. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు సాధించగా.. ఈసారి ఒక్క స్థానానికే పరిమితమైంది. రావికమతం మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ చెరో పది సీట్లు సాధించాయి. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ 12, జనసేన మూడు కలిపి మొత్తం 15 సీట్లు సాధించడం విశేషం. వైసీపీకి ఐదు స్థానాలు దక్కాయి. బుచ్చెయ్యపేట మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలలో టీడీపీ, జనసేన కలిసి 13 సీట్లు సాధించాయి. ఇందులో టీడీపీకి 12, జనసేన ఒకటి వచ్చాయి. వైసీపీ ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ 14 సీట్లు వచ్చాయి.
ఐక్యత, సమన్వయంతోనే కూటమి ఘన విజయం
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రభుత్వానిక అండగా నిలిచిన ప్రజలు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు
అనకాపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుతోపాటు కూటమి నేతల మధ్య ఐక్యత, సమన్వయం వల్లనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఘన విజయం సాధించాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ టీడీపీ జిల్లా కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా పరిశీలకుడు కొండపల్లి అప్పలనాయుడుతో కలసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలకు కూటమికే మద్దతు ఇచ్చారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి గెలుచుకోగా.. వాటిలో అనకాపల్లి జిల్లా వుండడం విశేషమని చెప్పారు. గడిచిన రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, గూగుల్ డేటా సెంటర్ వంటి దిగ్గజ కంపెనీలను తీసుకురావడంతోపాటు గోదావరి జలాలను జిల్లాకు తీసుకువచ్చామని చెప్పారు.
జడ్పీ పీఠం రేసులో..
టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి పలువురు ఆశావహులు
తమకు అవకాశం కల్పించాలని జిల్లా నేతలకు వినతి
రాష్ట్ర అధిష్ఠానాలదే తుది నిర్ణయం
ఎన్నికల ముందే ఎంపీపీ పదవుల పంపకం
టీడీపీకి 21, జనసేనకు 3
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని జడ్పీటీసీ (24 స్థానాలు)లను కూటమి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ 17, జనసేన ఐదు, బీజేపీ రెండుచోట్ల విజయం సాధించాయి. జడ్పీ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో కూటమిలోని మూడు పార్టీల్లోని పలువురు జడ్పీటీసీ విజేతలు ఈ పదవిని ఆశిస్తూ.. ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి జడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై రాష్ట్రస్థాయిలో ఆయా పార్టీల అధిష్ఠానాలు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో చైర్‌పర్సన్ పదవికి ఎవరి పేరునూ సూచించి స్థితిలో తాము లేమని మూడు పార్టీలకు చెందిన జిల్లాస్థాయి నేతలు.. ఆయా ఆశావహులకు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలోని 24 జడ్పీటీసీ స్థానాల్లో సగం.. అంటే 12 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. వీటిలో కశింకోట, మునగపాక, బుచ్చెయ్యపేట, రావికమతం, దేవరాపల్లి స్థానాలను బీసీ మహిళలకు రిజర్వు చేశారు. ఇవి కాకుండా బీసీ జనరల్, అన్‌రిజర్వుడ్ మహిళలు, అన్‌రిజర్వుడ్ స్థానాల్లో కూడా కొంతమంది బీసీ మహిళలు పోటీ చేసి విజయం సాధించారు. పార్టీల పరంగా చూస్తే.. మునగపాక, అచ్యుతాపురం, దేవరాపల్లి, రావికమతం, ఎస్.రాయవరం, నర్సీపట్నం జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తరపున బీసీ మహిళలు గెలుపొందారు. రాంబిల్లి, సబ్బవరం, పరవాడ, బుచ్చెయ్యపేట జడ్పీటీసీ నుంచి జనసేన పార్టీ తరపున బీసీ మహిళలు విజయం సాధించారు. బీజేపీ గెలిచిన రెండుచోట్లా (కశింకోట, పాయకరావుపేట) బీసీ మహిళలే వున్నారు. మొత్తం మీద 12 జడ్పీటీసీల నుంచి బీసీ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది మహిళలు జడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది.
ఇదిలావుండగా జడ్పీ చైర్‌పర్సన్ పదవికి అభ్యర్థి ఎంపికపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతోపాటు ఇతర ముఖ్య నాయకుల అభిప్రాయాలను ఆయా పార్టీల అధిష్ఠానాలు సేకరిస్తున్నట్టు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యతకు భంగం కలగకుండా ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులపై కసరత్తు
జిల్లాలోని అన్ని మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని ఎంపీపీ పదవులు కూటమికే దక్కుతాయి. అయితే ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం 21 ఎంపీపీ పదవులు తెలుగుదేశం పార్టీకి, మునగపాక, అచ్యుతాపురం, అనకాపల్లి ఎంపీపీ పదవులను జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఈ రెండు పార్టీలకు కేటాయించిన ఎంపీపీ స్థానాల్లో కొన్ని వైస్ ఎంపీపీ పదవులను బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలిసింది.
--------
అనకాపల్లి జిల్లాలో 24 జడ్పీటీసీ స్థానాలకు శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం వివిధ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. బ్రాకెట్లలో వున్న అంకెలు ఆయా పార్టీల అభ్యర్థులు/స్వతంత్రలు పోటీ చేసిన స్థానాలు...
మొత్తం పోలైన ఓట్లు 9,38,492
చెల్లని ఓట్లు 28,273 (3.01ు)
చెల్లిన ఓట్లు 9,10219
తెలుగుదేశం (17) 3,68,148 (40.45ు)
జనసేన (5) 87,133 (9.57ు)
బీజేపీ (2) 49,339 (5.42ు)
కూటమికి వచ్చిన ఓట్లు 5,04,620 (55.44ు)
వైసీపీ (24) 3,87,220 (42.54ు)
కాంగ్రెస్ (11) 2,811 (00.31ు)
సీపీఎం (6) 2,076 (00.23ు)
డీబీపీ (1) 2,106 (00.23ు)
బీఎస్పీ (5) 1,038 (00.11ు)
సీపీఐ (ఎంఎల్) (1) 145
బీసీవైపీ (2) 693
ఇండిపెండెంట్లు (6) 887
నోటా 8,623 (00.95ు)