Share News

రెండో దశలోనూ కూటమి హవా

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:10 AM

గ్రామ పంచాయతీ రెండోదశ ఎన్నికల్లోనూ కూటమి మద్దతుదారులు విజయదుందుభి మోగించారు.

రెండో దశలోనూ కూటమి హవా

అనకాపల్లి జిల్లాలో 70 శాతం పంచాయతీల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారుల గెలుపు

ఎన్నికలు జరిగిన పంచాయతీలు 213

148 సర్పంచ్‌ పదవులు కూటమి కైవసం

టీడీపీ- 111, జనసేన- 34, బీజేపీ- 3..

57 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారుల గెలుపు

ఏడుచోట్ల స్వతంత్రుల విజయం

అల్లూరి జిల్లాలో కూటమికి పెరిగిన మద్దతు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి/ న్యూస్‌నెట్‌వర్క్‌)

గ్రామ పంచాయతీ రెండోదశ ఎన్నికల్లోనూ కూటమి మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. అనకాపల్లి జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 70 శాతం పంచాయతీల్లో విజయం సాధించారు. మొత్తం 213 గ్రామపంచాయతీలకు రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరగలేదు. మిగిలిన 212 పంచాయతీల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 148 పంచాయతీల సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకున్నారు. వీటిలో 111 తెలుగుదేశం, 34 జనసేన, మూడు బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 57 పంచాయతీల్లో విజయం సాధించారు. మొదటి దశ ఫలితాలతో పోలిస్తే.. రెండో దశలో వైసీపీ బలం పుంజుకుంది. ఏడు పంచాయతీల్లో స్వతంత్రులు విజయం సాధించారు.


అల్లూరి జిల్లాలో హోరా హోరీ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అనంతగిరి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 87 పంచాయతీలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో కూటమి 35, వైసీపీ 37 సర్పంచ్‌ పదవులను దక్కించుకున్నాయి. 15 మంది స్వతంత్రులు విజయం సాధించారు. కూటమి పార్టీలు ఈసారి బాగా పుంజుకున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే రెండో విడతలో కూటమి పార్టీలు అనూహ్యంగా దూసుకుపోయాయి. ఆశించిన స్థాయిలో సర్పంచులు గెలుపొందడం ఏజెన్సీ ఓటర్లలో మార్పునకు సంకేతంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులపై ఆయా రాజకీయ పార్టీలు అంచనాలు రూపొందించుకుంటున్నాయి.

Updated Date - Nov 30 , 2026 | 01:10 AM