గిరిజనుల సంక్షేమానికి కూటమి పెద్దపీట
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:41 PM
రాజకీయాలకు అతీతంగా గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో తీవ్ర అన్యాయానికి గురైంది. దీంతో రాజ్యాంగం పరంగా గిరిజనులకున్న సంక్షేమ పథకాలను రద్దు చేయడంతోపాటు పల్లెల్లో మౌలిక సదుపాయాలు సైతం కల్పించని దుస్థితి కొనసాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది.
రూ.202 కోట్లతో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధి
పల్లెల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన
జీవో:3 పునరుద్ధరణకు చర్యలు
1/70 చట్ట పరిరక్షణ, బాక్సైట్ మైనింగ్‌పైనా స్పష్టత ఇచ్చిన సీఎం
గిరిజనులపై వివక్ష చూపిన వైసీపీ ప్రభుత్వం
నేడు అరకులోయలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
భూమి, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనులకు కాఫీ తోటల అభివృద్ధితో ఆదాయాన్ని పెంచేందుకు రూ.202 కోట్లతో లక్ష ఎకరాల్లో కాఫీ ప్రాజెక్టును గతేడాది ఆదివాసీ దినోత్సవాల్లో కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. గిరిజన పల్లెలకు రోడ్డు, రవాణా, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ప్రధానంగా అడవితల్లి బాట కార్యక్రమంలో రూ.200 కోట్లతో 150 గిరిజన పల్లెలకు శాశ్వత తారురోడ్డు సదుపాయం కల్పిస్తున్నది. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగు నీరందించే పనులు జరుగుతున్నాయి. కూటమి రెండున్నర ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు అధికంగా నిధులు మంజూరు చేయడంతో పల్లెల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యమైన ధింసాను విశ్వవ్యాప్తం చేసింది.
గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణ
ఐదో షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనులకు రాజ్యాంగం పరంగా దక్కే హక్కులు, చట్టాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం పదే పదే పేర్కొంటున్నది. ప్రధానంగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన జీవో 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పరిరక్షణ, జిల్లాను జోన్-1 లోనే కొనసాగించాలనే డిమాండ్లపై గిరిజనులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. గిరిజనులకు న్యాయం చేస్తామని గత జూలై నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కచ్చితమైన హామీ ఇచ్చారు. అల్లూరి జిల్లాను జోన్-1నే కొనసాగించాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. బాక్సైట్ మైనింగ్ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ కోర్టులో ఉండడంతో తమ ప్రభుత్వం మైనింగ్ జోలికి వెళ్లడం లేదని సీఎం పేర్కొన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కారానికి గిరిజన సంఘాల నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించింది. జూలై 28న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలతోపాటు ఇతర ఉన్నతాధికారులు గిరిజన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. జిల్లా స్థాయి అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిపి ‘ఉన్నత స్థాయి కమిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు గానూ కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది.
రూ.202 కోట్లతో కొత్త కాఫీ ప్రాజెక్టు
ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గతేడాది రూ.202 కోట్లతో కొత్త కాఫీ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో భాగంగా రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చే స్తారు. ఇందుకుగానూ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 10 వేలు, 2028లో 10వేలు, 2029లో 20 వేలు, 2030లో 30 వేలు, 20231లో 30 వేల ఎకరాల చొప్పున కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపడతారు. ఈప్రాజెక్టులో భాగంగానే గతేడాది 30 వేల ఎకరాల్లో గిరిజన రైతులకు పండ్ల మొక్కలను అందించారు. ఈఏడాది మరో 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలను అందించనున్నారు. అలాగే 2026 నుంచి 2031 వరకు ఐదేళ్లలో ఏడాదికి 15 వేల ఎకరాలు చొప్పున మొత్తం 75 వేల ఎకరాల్లో పాత తోటల పునరుద్ధరణకు చర్యలు చేపడతారు. ఈకొత్త కాఫీ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలో మరో లక్ష గిరిజన రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును నిర్మూలించడంతోపాటు గతేడాది నుంచి ఏడాదికి 30 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలను ఉచితంగా గిరిజనులకు అందిస్తున్నారు. దీంతో వాటి ద్వారా గిరిజనులు భవిష్యత్‌లో చక్కని ఆదాయం పొందుతారు. అవకాడో, లిచ్చీ వంటి పంటలతోపాటు పసుపు, వలిసెలు, చిరధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ఆదివాసీలపై వివక్ష చూపిన వైసీపీ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆదివాసీలపై వివక్ష కొనసాగింది. ఫలితంగా ఒక్క గ్రామానికి రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించని పరిస్థితి ఏర్పడింది. ఏ గ్రామ పంచాయతీకి ఒక్క రూపాయి విడుదల చేయకుండా పల్లెల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. వైసీపీ అధికారంలో ఉండగానే 2020 ఏప్రిల్‌లోనే జీవో 3ని సుప్రీంకోర్డు రద్దు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం దానిపై కనీసం స్పందించలేదు. కాని నేడు జీవో 3పై వైసీపీ శ్రేణులు నానాయాగీ చేస్తుండడం గమనార్హం. గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం, కార్పొరేట్ విద్యా పథకం, అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. గిరిజనులకు రాయితీపై స్వయం ఉపాధి యూనిట్‌లు అందించే ట్రైబల్ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది. ఎస్‌టీ రిజర్వేషన్ ద్వారా అందించాల్సిన ఎటువంటి పథకాలను అమలు చేయలేదు. ఆఖరుకు జగనన్న కాలనీల పేరిట కనీసం ఒక గిరిజనుడికి కూడా ఇల్లు కట్టించని పరిస్థితి కొనసాగిన విషయాలను గిరిజనులు ఇంకా మర్చిపోలేదు. కాని కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది.
నేడు ’సంజీవని ప్రాజెక్టు’కు ప్రారంభోత్సవం
ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ వైద్యారోగ్య సేవలు మరింత చేరువ చేసే ‘సంజీవని ప్రాజెక్టు’ను జిల్లాలో అరకులోయ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో అమలు చేసే సంజీవని ప్రాజెక్టును గిరిజన ప్రాంతంలో ప్రారంభోత్సవం చేయడం గమనార్హం. ప్రధానంగా గిరిజన ప్రాంతంలోని వైద్యారోగ్య సేవలను మెరుగుపర్చాలనే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్నిజిల్లాలో ప్రారంభోత్సవం చేస్తున్నారని అధికారులు, కూటమి నేతలు అంటున్నారు.