Share News

చింతపల్లి కోటపై కూటమి జెండా

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:34 PM

చింతపల్లి మేజర్‌ పంచాయతీలో కూటమి పాగా వేసింది. తొలిసారిగా టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి రీమల వరహాలమ్మ భారీ మెజారిటీతో విజయం సాధించింది.

చింతపల్లి కోటపై కూటమి జెండా
సర్పంచ్‌గా ఎన్నికైన రీమల వరహాలమ్మ

మేజర్‌ పంచాయతీలో తొలిసారిగా టీడీపీ పాగా

వైసీపీ ఎత్తులకు చిత్తు చేసిన ఓటర్లు

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

చింతపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

చింతపల్లి మేజర్‌ పంచాయతీలో కూటమి పాగా వేసింది. తొలిసారిగా టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి రీమల వరహాలమ్మ భారీ మెజారిటీతో విజయం సాధించింది. వైసీపీ ఎత్తులకు పంచాయతీ ఓటర్లు చిత్తు చేశారు. సర్పంచ్‌ పీఠాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. దీంతో కూటమి బలపర్చిన రీమల వరహాలమ్మ, వైసీపీ బలపర్చిన అభ్యర్థి దురియా పుష్పలత తీవ్ర పోటీ నెలకొన్నది.

పాడేరు నియోజకవర్గంలో పాడేరు, చింతపల్లి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పదవులను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తాయి. మొదటి దశ ఎన్నికల్లో చింతపల్లి సర్పంచ్‌ పదవికి ఎన్నిక జరిగింది. వైసీపీ నుంచి జడ్పీటీసీ మాజీ సభ్యుడు పోతురాజు బాలయ్య సతీమణి దేవుడమ్మ, మరో నాయకురాలు కవడం కాసులమ్మ, తాజా మాజీ సర్పంచ్‌ దురియా పుష్పలత నామినేషన్‌ దాఖలు చేశారు. కూటమి నుంచి స్థానిక టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు భార్య వరహాలమ్మ నామినేషన్‌ వేసింది. వైసీపీ నుంచి పోటీలోనున్న జడ్పీటీసీ మాజీ సభ్యుడు పోతురాజు బాలయ్య సతీమణి దేవుడమ్మ, మరో నాయకురాలు కవడం కాసులమ్మలను పోటీ నుంచి తప్పుకునేలా ఎమ్మెల్యే సమన్వయం చేశారు. దీంతో వైసీపీ నుంచి కేవలం దురియా పుష్పలత ఒక్కరే పార్టీ బలపర్చిన అభ్యర్థిగా ప్రచారం చేశారు. చింతపల్లి సర్పంచ్‌ పీఠాన్ని ఎలాగైన సొంతం చేసుకోవాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విశ్వప్రయత్నాలు చేశారు. వైసీపీ నేతలను, క్యాడర్‌ను సమన్వయపరచి ఐక్యంగా ప్రచారంతోపాటు వ్యూహాన్ని ఎమ్మెల్యే రచించారు. అలాగే చింతపల్లి సర్పంచ్‌ పీఠం కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి రంగ ప్రవేశం చేశారు. మండల కేంద్రంలో ముఖ్యనాయకులతో సమావేశమై ‘తానే సర్పంచ్‌ అభ్యర్థి’గా పోటీ చేశానని భావించి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆమె పిలుపు మేరకు టీడీపీ, జనసేన నాయకులందరూ ఏకమయ్యారు. వీరికి వర్తక సంఘం, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపి, టీడీపీ బలపర్చిన వరహాలమ్మకు మద్దతుగా ప్రచారం చేశారు. ఒక దశలో గిరిజనేతరులను భయపెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించినప్పటికీ గిడ్డి ఈశ్వరి ఇచ్చిన భరోసాతో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. గిరిజనులు, గిరిజనేతరులు ఏకపక్షంగా కూటమికి మద్దతుగా నిలిచారు. కాగా వర్తక సంఘం, జనసేన, టీడీపీ నాయకులు స్థానిక గిరిజన ఉద్యోగి వినాయకరావు భార్య మాధవిని సర్పంచ్‌గా బరిలోకి దించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే వారి అభ్యర్థనను సున్నితంగా మాధవి తిరస్కరించింది. వరహాలమ్మకు మాధవి మద్దతు ప్రకటించడం, విస్తృత ప్రచారం నిర్వహించడం కూటమికి కలిసి వచ్చింది. జడ్పీటీసీ సభ్యురాలు కోరాబు అనూషదేవిని వైసీపీ నేతలు దూరం పెట్టడం పుష్పలతకు నష్టం కలిగించిందని చెప్పుకుంటున్నారు. టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి రీమల వరహాలమ్మ 2,079 ఓట్లు సాధించగా.. వైసీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి దురియా పుష్పలత 1,198 ఓట్లు సాధించారు. వరహాలమ్మ పంచాయతీ చరిత్రలో 881 భారీ మెజారిటీతో విజయం సాధించారు. చింతపల్లి మేజర్‌ పంచాయతీలో ప్రారంభం నుంచి కాంగ్రెస్‌, సీపీఐ, వైసీపీ బలపర్చిన అభ్యర్థులు మాత్రమే సర్పంచ్‌గా పాలన సాగించారు. తొలిసారిగా టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించడంతో కొత్త ఒరవడికి కూటమి నాంది కాగలదని స్థానికులు అంటున్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:34 PM