గెలుపుపై కూటమిలో ధీమా
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:15 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో, ఓటర్ల తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో భద్రంగా ఉంది. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత ప్రధాన రాజకీయ పక్షాల శిబిరాల్లో విశ్లేషణ మొదలైంది. ఈ నెల 7న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే చర్చసాగుతున్నది. ప్రాదేశిక ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదు కావడంతో తమ అభ్యర్థుల విజయం ఖాయమని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అన్ని జడ్పీటీసీలతోపాటు 90 శాతానికిపైగా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామంటున్న మూడు పార్టీల శ్రేణులు
ప్రభుత్వంపై సానుకూలతోపాటు మునిసిపల్ ఫలితాల ప్రభావం
ప్రతిపక్ష వైసీపీలో అంతర్మథనం
బ్యాలెట్ బాక్సుల్లో ఓటరు తీర్పు నిక్షిప్తం
రేపు ఓట్ల లెక్కింపు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో, ఓటర్ల తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో భద్రంగా ఉంది. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత ప్రధాన రాజకీయ పక్షాల శిబిరాల్లో విశ్లేషణ మొదలైంది. ఈ నెల 7న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే చర్చసాగుతున్నది. ప్రాదేశిక ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదు కావడంతో తమ అభ్యర్థుల విజయం ఖాయమని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు రెండు రోజుల క్రితం వెల్లడైన మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఘన విజయం సాధించడం.. ప్రాదేశిక ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మరింత సానుకూలత పెరిగిందని అంటున్నారు. జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలతోపాటు 90 శాతానికిపైగా ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు.
వైసీపీ శిబిరంలో డీలా
మునిసిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రతిపక్ష వైసీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముగిసింది. కూటమి శ్రేణులు అట్టహాసంగా ర్యాలీలతో ప్రచారాన్ని ముగించగా, వైసీపీ శ్రేణులు సాదాసీదాగా ప్రచారం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తమకు పట్టు ఉందంటూ పైకి బింకంగా చెప్పినప్పటికీ.. లోలోన ఓటమి భయం పట్టుకున్నది. క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళి, ఓటింగ్ శాతాన్ని బేరీజు వేసుకుంటున్న వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. కనీసం పరువు దక్కే స్థాయిలో అయినా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలవాలని కోరుకుంటున్నారు.