Share News

కూటమి క్లీన్‌ స్వీప్‌

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:57 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.

కూటమి క్లీన్‌ స్వీప్‌

జిల్లాలోని నాలుగు జడ్పీటీసీల్లోనూ విజయం

భీమిలి, పద్మనాభం, పెందుర్తిలో టీడీపీ, ఆనందపురంలో జనసేన అభ్యర్థుల గెలుపు

53 ఎంపీటీసీల్లో 37 కూటమి కైవసం

టీడీపీకి 29, జనసేనకు ఏడు స్థానాలు, వైసీపీకి 16

విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. జిల్లాలోని నాలుగు జడ్పీటీసీ స్థానాలనూ గెలుచుకుంది. ఇక 53 ఎంపీటీసీ స్థానాలకుగాను ఒకటి (పెదగాడి..జనసేన) ఏకగ్రీవం కాగా మిగిలిన 52 స్థానాల్లో తెలుగుదేశం 29, జనసేన 7, వైసీపీ 16 స్థానాల్లో విజయం సాధించాయి. ఒక్క ఆనందపురం మండలంలోనే కూటమికి వైసీపీ గట్టి పోటీ ఇవ్వగలిగింది.

ఈనెల ఐదో తేదీన ఎన్నికలు నిర్వహించగా శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆనందపురం ఎంపీడీవో కార్యాలయం, పెందుర్తి జూనియర్‌ కళాశాలలో ఆయా మండలాల ఓట్ల లెక్కింపు జరిగింది. భీమిలి, పద్మనాభం మండలాల ఓట్ల లెక్కింపు భీమిలి సిడార్‌ స్కూలులో నిర్వహించారు. మధ్యాహ్నానికి సగానికిపైగా ఎంపీటీసీల ఫలితాలు వెల్లడించారు. సాయంత్రానికి జడ్పీటీసీ స్థానాల ఫలితాలు వచ్చాయి. ఆనందపురం మండలం గంభీరం ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుపై కూటమి అభ్యంతరం వ్యక్తంచేయడంతో తిరిగి లెక్కింపు చేపట్టారు. చివరకు ఆ స్థానం నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధించారు.

కూటమి ఖాతాలో నాలుగు జడ్పీటీసీలు

పునర్విభజన అనంతరం నాలుగు (ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి) మండలాలతో ఏర్పడిన విశాఖ జిల్లా పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో కూటమి పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. ఆనందపురంలో జనసేన అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావు 1,557 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మజ్జి వెంకటరావుపై విజయం సాధించారు. అక్కడ మొత్తం 44,086 ఓట్లు పోలవ్వగా జనసేన అభ్యర్థికి 21,777 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 20,220 ఓట్లు వచ్చాయి. నోటాకు 248 ఓట్లు రాగా చెల్లని ఓట్లు 1,384గా గుర్తించారు. భీమిలి జడ్పీటీసీగా గాడు అలివేణి 4,139 ఓట్ల మెజారిటీతో వైసీసీ అభ్యర్థిని వెంపాడ రమావతిపై విజయం సాధించారు. మొత్తం 29,925 ఓట్లు పోలవ్వగా టీడీపీ అభ్యర్థిని 16,137 ఓట్లు, వైసీపీ అభ్యర్థినికి 11,998 ఓట్లు వచ్చాయి. పద్మనాభంలో తెలుగుదేశం అభ్యర్థి కోరాడ సత్యవతి 3,110 ఓట్ల ఆధిక్యంతో వైసీపీకి చెందిన కోరాడ మంజుపై గెలుపొందారు. మొత్తం 34,452 ఓట్లు పోలవ్వగా, 986 చెల్లుబాటు కాలేదు. నోటాకు 355 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థి సత్యవతికి 18,288, వైసీపీ అభ్యర్థి మంజుకు 15,178 ఓట్లు వచ్చాయి. పెందుర్తిలో టీడీపీ అభ్యర్థి సుఖవాసి అజయ్‌ 1418 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి కోడిగుడ్ల దేవీసాంబమూర్తిపై విజయం సాధించారు.

కూటమికి 36 ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలో 53 ఎంపీటీసీ స్థానాలకుగాను ఒకటి ఏకగ్రీవం కాగా 52 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ 29, జనసేన ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడి పోయింది. వైసీపీ 16 స్థానాలు దక్కించుకుంది. ఆనందపురం మండలంలో 17 స్థానాలకుగాను టీడీపీ ఆరు, జనసేన నాలుగు, వైసీపీ ఏడు గెలుచుకున్నాయి. భీమిలి మండలంలో గల 12 స్థానాల్లో టీడీపీ తొమ్మిది, ఒకటి జనసేన, రెండు వైసీపీ, పద్మనాభం మండలంలో గల 15 స్థానాల్లో టీడీపీ 11, వైసీపీ నాలుగు, పెందుర్తి మండలంలో ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ, వైసీపీ మూడేసి, జనసేన రెండుచోట్ల విజయం సాధించాయి.


జడ్పీ పీఠం ఎవరికో?

ఎవరి ప్రయత్నంలో వారు

విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని నాలుగు జడ్పీటీసీ స్థానాల్లోనూ కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తోందనేది కూటమి పార్టీల్లో చర్చ సాగుతుంది. ఆనందపురంలో ఎన్ని శ్రీనివాసరావు (జనసేన) భీమిలిలో గాడు అలివేణి (టీడీపీ), పద్మనాభంలో కోరాడ సత్యవతి (టీడీపీ), పెందుర్తిలో సుఖవాసి అజయ్‌ (టీడీపీ) గెలుపొందారు. నాలుగింటిలో మూడు భీమిలి నియోజకవర్గ పరిధిలో, మరొకటి పెందుర్తి సెగ్మెంట్‌ పరిధిలో ఉన్నాయి. దీంతో జడ్పీ చైర్మన్‌ ఎంపికలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలకంగా మారారు. అయితే కూటమి పార్టీల మధ్య జరిగే ఒప్పందంపై జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక ఉంటుందని అంటున్నారు. జనసేనకు కేటాయిస్తే ఆనందపురం జడ్పీటీసీ ఎన్ని శ్రీనివాసరావుకు అవకాశం లభిస్తుంది. లేదంటే మిగిలిన ముగ్గురి (అలివేణి, కోరాడ సత్యవతి, అజయ్‌)లో ఒకరికి ఛాన్స్‌ దక్కవచ్చు. నలుగురు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

మండలం ఎంపీటీసీ టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ

స్థానాలు

1. భీమిలి 12 9 1 - 2

2. ఆనందపురం 17 6 4 - 7

3. పద్మనాభం 15 11 - - 4

4. పెందుర్తి 9 3 3 - 3

Updated Date - Nov 08 , 2026 | 01:57 AM