కూటమి క్లీన్ స్వీప్
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:46 AM
పరిషత్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. పట్టణాల్లోనే కాదు... గ్రామీణ ప్రాంతంలోనూ తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. మూడు పార్టీలు ఐకమత్యంతో పనిచేయడంతో ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటింది. జిల్లాలోని ఏడు ప్రదేశాల్లో పది కేంద్రాల్లో శనివారం ఉదయం ఎనిమిది గంలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. పోస్టల్ బ్యాలెట్లతోనే కూటమి హవా మొదలైంది.
పరిషత్ ఎన్నికల్లో జయకేతనం
మొత్తం 24 జడ్పీటీసీ స్థానాలూ కైవసం
పూర్తిగా చతికిలపడిన వైసీపీ
తెలుగుదేశం-17 జనసేన-5 బీజేపీ-2 స్థానాల్లో గెలుపు
425 ఎంపీటీసీలకుగాను 342 స్థానాల్లో కూటమివిజయం
టీడీపీ- 248, జనసేన- 86, బీజేపీ- 8, వైసీపీ- 74, ఇతరులు- 11
కూటమి శ్రేణుల విజయోత్సవాలు
అనకాపల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):
పరిషత్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. పట్టణాల్లోనే కాదు... గ్రామీణ ప్రాంతంలోనూ తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. మూడు పార్టీలు ఐకమత్యంతో పనిచేయడంతో ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటింది. జిల్లాలోని ఏడు ప్రదేశాల్లో పది కేంద్రాల్లో శనివారం ఉదయం ఎనిమిది గంలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. పోస్టల్ బ్యాలెట్లతోనే కూటమి హవా మొదలైంది. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు చేపట్టగా.. కూటమి అభ్యర్థులు దూసుకుపోయారు. జిల్లాలో మొత్తం 24 జడ్పీటీసీ స్థానాలను కూటమి శత శాతం విజయం సాధించింది. ప్రతిపక్ష వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17, జనసేన పార్టీ ఐదు, భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అనకాపల్లి జడ్పీటీసీ నుంచి టీడీసీ అభ్యర్థి 16,261 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయదుందుభి మోగించగా, నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి అత్యల్పంగా 1,105 మెజారిటీతో గెలుపొందారు.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లోనూ (ఎంపీటీసీలు) కూటమి ఘన విజయం సాధించింది. జిల్లాలో మొత్తం 427 ఎంపీటీసీ స్థానాలకుగాను కూటమి 342 స్థానాలను (80 శాతం) కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీకి 248, జనసేనకు 86, బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష వైసీపీ 74 సీట్లతో (17.33 శాతం) మూడో స్థానానికి పరిమితం అయ్యింది. స్వతంత్ర అభ్యర్థులు 11 స్థానాల్లో గెలిచారు.
ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
జిల్లాలో 24 జడ్పీటీసీ స్థానాలకు పోలైన 9,38,492 ఓట్లను లెక్కించారు. వీటిలో 28,273 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో (9,10,219) టీడీపీకి 3,68,148, జనసేనకు 87,133, బీజేపీకి 49,339 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 3,87,220 ఓట్లు, కాంగ్రెస్కు 2,811, సీపీఎంకు 2,076, సీపీఐ (ఎంఎల్)కు 145, బీఎస్పీకి 1,038, బీసీవైకి 693, దళిత బహుజన పార్టీకి 2,106, ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులకు 887,రాగా, నోటాకు 8,623 ఓట్లు పోలయ్యాయి.