Share News

కూటమి సర్దుబాటు

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:13 AM

జీవీఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీ నేతల మధ్య నాలుగు రోజులుగా సాగుతున్న చర్చలు శనివారం రాత్రి పదకొండు గంటలకు ఒక కొలిక్కివచ్చాయి.

కూటమి సర్దుబాటు

  • జీవీఎంసీలో సీట్ల పంపకంపై కొలిక్కివచ్చిన కసరత్తు

  • టీడీపీకి 80, జనసేనకు 30, బీజేపీకి 10 వార్డులు

  • అవగాహనకు వచ్చిన మూడు పార్టీల నేతలు

  • అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

  • ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీ నేతల మధ్య నాలుగు రోజులుగా సాగుతున్న చర్చలు శనివారం రాత్రి పదకొండు గంటలకు ఒక కొలిక్కివచ్చాయి. మొత్తం 120 వార్డుల్లో తెలుగుదేశం 80, జనసేన 30, బీజేపీకి 10 వార్డుల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు మూడు పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. అయితే సీట్ల కేటాయింపుపై అవగాహనకు వచ్చినప్పటికీ ఎవరికి ఏఏ వార్డులు ఇవ్వాలనే దానిపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీంతో 120 వార్డులకు అభ్యర్థుల పేర్లు ప్రకటనను ఆదివారానికి వాయిదా వేశారు.

కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం చివరి వరకు ఉత్కంఠగా సాగింది. మొత్తం 120 వార్డులు ఉండగా జనసేన నాయకులు 40 సీట్లు కోరడంతో చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ పార్టీకి 20 శాతం అంటే...24 వార్డులు ఇవ్వాల్సి ఉంది. కానీ అంతకంటే ఎక్కువ, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో గల స్థానాల్లో 50 శాతం తమకే కావాలని జనసేన ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై మూడు పార్టీల నేతలు గత రెండు రోజులుగా చర్చలు నిర్వహిస్తూనే ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాల వీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేశ్‌బాబు, జిల్లా పార్టీల అధ్యక్షులు అంతా కూర్చుని ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ముందుకుసాగాలని సంయమనంతో వ్యవహరించారు. ఎట్టకేలకు జనసేనకు మొత్తం సీట్లలో 30, బీజేపీకి పది సీట్లు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని అధిష్ఠానానికి కూడా తెలియజేసి, ఆ తరువాత ప్రకటించాలని భావిస్తున్నారు.

అంతా ఒకేసారి

పార్టీల ప్రకారం సీట్ల సర్దుబాటు తరువాత ఏ వార్డు నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనేది టీడీపీ, జనసేన, బీజేపీలు ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పరిధిలో వార్డులకు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. ఎక్కువ మంది ఆశావహులు ఉన్నప్పటికీ, సామాజిక వర్గ సమీకరణాలు, ఆర్థిక బలం, విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే కొన్ని వార్డుల్లో టికెట్‌ ఖరారు కాకుండానే కొందరు ఆశావహులు ముహూర్తం బాగుందని శనివారం నామినేషన్లు వేసేశారు. వన్‌టౌన్‌లో మాజీ కార్పొరేటర్‌ కందుల నాగరాజు (జనసేన) తన భార్యతో శనివారం నామినేషన్‌ వేయించారు. జనసేన, బీజేపీలు రెండూ అత్యధికంగా మాజీ కార్పొరేటర్లకు, గతంలో పోటీ చేసిన వారికే ఈసారి కూడా టికెట్లు ఖరారు చేయాలని భావిస్తున్నాయి. శనివారం రాత్రికి టికెట్ల సర్దుబాటు లెక్కలు మాత్రం ప్రకటించి, ఆదివారం నేరుగా అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఆదివారం ఉదయమే ఆయా పార్టీల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - Oct 18 , 2026 | 01:13 AM