రహదారులన్నీ రద్దీ
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:03 AM
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారితో జాతీయ రహదారితో పాటు నగరంలోని రహదారులన్నీ రద్దీగా మారాయి.
హైవేపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
విశాఖపట్నం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారితో జాతీయ రహదారితో పాటు నగరంలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. ఎక్కువ మంది సొంత కార్లు, ద్విచక్ర వాహనాలపై బయలుదేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే జాతీయ రహదారిపై హనుమంతవాక జంక్షన్ నుంచి ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఉదయం 11 నుంచి రాత్రి పది గంటల వరకూ అదే పరిస్థితి కొనసాగింది. అటు నుంచి నగరంలోకి వచ్చేవారు కారుషెడ్ జంక్షన్, ఎండాడ జంక్షన్లు దాటడానికి సుమారు గంటకు పైగా సమయం పట్టింది. ఇక నగరంలో రహదారులు కూడా షాపింగ్ చేసే వారితో రద్దీగా మారాయి. మద్దిలపాలెం జంక్షన్, జగదాంబ సెంటర్, సిరిపురం వీఐపీ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్ ప్రాంతాలకు వాహనాలతో వెళ్లడం కష్టంగా మారింది.
టౌన్‌ప్లానింగ్ గాజువాక ఏసీపీపై విచారణ
కమిషనర్‌కు విజిలెన్స్ విభాగం ఆదేశం
అక్రమాలకు పాల్పడుతున్నారని అభియోగాలు
గాజువాక, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
గాజువాక జోనల్ ప్రణాళికా విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె.వెంకటరావు అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక పంపాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విజిలెన్స్ విభాగం జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. టౌన్‌ప్లానింగ్ నిబంధనలను అతిక్రమించి అడ్డగోలుగా నిర్మించే అపార్ట్‌మెంట్లు, భారీ భవంతుల నిర్మాణదారుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని, జీవీఎంసీకి రుసుములు ఎగ్గొట్టి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ చూసీచూడనట్ట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాక జోన్‌తోపాటు అనకాపల్లి జోనల్ ఇన్‌చార్జి ఏసీపీగా వెంకటరావు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన చోట కూడా ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ విజిలెన్స్ విభాగానికి నేరుగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో పురపాలక, పటణాభివృద్ధిశాఖ విచారణకు ఆదేశించింది. మరికొద్ది నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయనుండడంతో మరింతగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.