Share News

రెబల్‌ విజేలంతా కూటమి నేతలే..

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:31 AM

జిల్లాలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

రెబల్‌ విజేలంతా కూటమి నేతలే..

11 ఎంపీటీసీ స్థానాల్లో ఇండెంపెండెంట్లు గెలుపు

ఒక్కరు మినహా మిగిలిన వారంతా కూటమి తిరుగుబాటుదారులు

తెలుగుదేశం-7, జనసేన-3

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన వారంతా కూటమి రెబల్‌ అభ్యర్థులు కావడం విశేషం. ఈ పది మందిలో ఏడుగురు తెలుగుదేశం పార్టీ, ముగ్గురు జనసేన పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థులు. మొత్తం పది స్థానాల్లో సగం.. అంటే ఐదు స్థానాలు అచ్యుతాపురం మండలంలోనే వున్నాయి.

అచ్యుతాపురం మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాల నుంచి ఇండిపెండెంట్లు గెలుపొందారు. వీరంతా తెలుగుదేశం పార్టీ రెబల్స్‌ కావడం విశేషం. వీటిలో రెండు స్థానాలు టీడీపీ, మరో రెండు స్థానాలు జనసేన, ఇంకో స్థానం బీజేపీకి కేటారుంచివి. పూడిమడక-1 ఎంపీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ నాయకుడు కాసారపు పోలరాజు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసి జనసేన అభ్యర్థి పోలవరపు పారునాయుడుపై 40 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పూడిమడక-2 ఎంపీటీసీ టికెట్‌ను సీనియర్‌ నేత వాసుపల్లి అప్పారావు ఆశించారు. కానీ ఆయనకు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఇతను 401 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గనగళ్ల నవీన్‌పై విజయం సాధించారు. దిబ్బపాలెం-2 ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ రెబల్‌ అభ్యర్థి లాలం శాంతి 258 ఓట్ల తేడాతో జనసేన అభ్యర్థి తుమ్మల మంగపై గెలిచారు. దిబ్బపాలెం-3 సెగ్మెంట్‌ నుంచి టీడీపీ రెబల్‌ కాళ్ల సన్యాసమ్మ టీడీపీ అభ్యర్థి పోలవరపు పార్వతిపై 372 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.. నునపర్తి ఎంపీటీసీ నుంచి టీడీపీ రెబల్‌ అభ్యర్థి రెడ్డి లక్ష్మీకుమారి 47 ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.

పాయకరావుపేట మండలం నామవరం ఎంపీటీసీ నుంచి జనసేన రెబెల్‌ అభ్యర్థి కొరిమి సూర్యారావు 177 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చెల్లిన ఓట్లలో ఇతనికి 826 ఓట్లు, టీడీపీ అభ్యర్థి గొర్ల లక్ష్మీనారాయణకు 649 ఓట్లు, వైసీపీ అభ్యర్థి గదుల లోవరాజుకు 168 వచ్చాయి. 62 ఓట్లు చెల్లలేదు. నోటాకు ఆరు ఓట్లు పడ్డాయి.

రాంబిల్లి మండలం గొరపూడి ఎంపీటీసీ నుంచి టీడీపీ రెబల్‌ అభ్యర్థి లెక్కల శ్రావణి 288 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. ఈమెకు 1,031 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి లాలం అరుణకు 743 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రుత్తల పైడిరత్నంకు 94 ఓట్లు వచ్చాయి. ఇదే మండలం లాలంకోడూరు ఎంపీటీసీ నుంచి జనసేన రెబల్‌ అభ్యర్థి కసిరెడ్డి హైమావతి 335 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమెకు 952 ఓట్లు రాగా, జనసేన అభ్యర్థి కసిరెడ్డి శ్రావణికి 613 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రుత్తల సంధ్యకు 22 ఓట్లు వచ్చాయి.

నక్కపల్లి మండలం జానకయ్యపేట ఎంపీటీసీ నుంచి జనసేన రెబల్‌ అభ్యర్థి కురందాసు అప్పలరాజు 316 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈయనకు 924 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి కురందాసు నానాజీకి 608 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కె.నానాజీకి 402 ఓట్లు పోలయ్యాయి.

కె.కోటపాడు మండలం గొండుపాలెం ఎంపీటీసీ నుంచి తెలుగుదేశం రెబల్‌ అభ్యర్థి బండారు ముత్యపాత్రుడు 560 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పోలైన ఓట్లలో ఇతనికి 1,204 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బండారు దేముడుబాబుకు 644 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో ప్రతిపక్ష వైసీపీ పోటీ చేయలేదు.


ఒక ఊరు.. ముగ్గురు జడ్పీటీసీలు!

కైలాసపట్నం మహిళలను వరుసగా మూడుసార్లు వరించిన పదవి

కోటవురట్ల, నవంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కైలాసపట్నం గ్రామానికి రాజకీయంగా ఒక విశిష్టత వుంది. ఈ ఊరుకు చెందిన ముగ్గురు మహిళలు 2014 నుంచి వరుసగా మూడుసార్లు జడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. వీరిలో ఇద్దరు వైసీపీ తరపున, మరొకరు తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. అంతేకాక జడ్పీటీసీ వ్యవస్థ ఏర్పడిన తరువాత ఇంతవరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా.. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందింది. కోటవురట్ల జడ్పీటీసీని 2014లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. అప్పట్లో కైలాసపట్నం గ్రామానికి చెందిన వంతర వెంకట లక్ష్మి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 2021లో జరిగిన ఎన్నికల్లో జడ్పీటీసీ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. ఇదే గ్రామానికి చెందిన సిద్దాబత్తుల ఉమాదేవి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి 6,917 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లాలం పద్మావతిపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో జడ్పీటీసీని ఎస్సీ మహిళకు రిజర్వు చేయడంతో ఇదే గ్రామానికి చెందిన పురం నాగవేణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి పెన్నాడ చిన్నారిపై 3,839 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Updated Date - Nov 10 , 2026 | 01:31 AM