Share News

పల్స్‌ పోలియోకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:33 AM

పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న మొత్తం 1,97,180 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

పల్స్‌ పోలియోకు సర్వం సిద్ధం

- నేడు 1,016 బూత్‌లలో నిర్వహణ

- జిల్లాలో 1.97 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యం

అనకాపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న మొత్తం 1,97,180 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 1,016 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా అధికారుల గణాంకాల ప్రకారం 5,44,765 గృహాలు ఉన్నాయి. సుమారు 17,27,151 మంది జనాభా ఉన్నారు. ఇందులో ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 1,97,180 మందిగా అంచనా వేశారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,74,513 మంది, పట్టణ ప్రాంతాల్లో 22,667 మంది ఉన్నారు. ఆదివారం నాటి పల్స్‌పోలియో నిర్వహణ కోసం 903 గ్రామీణ బూత్‌లు, 113 పట్టణ బూత్‌లు ఏర్పాటు చేశారు. 51 ట్రాన్సిట్‌ బూత్‌లు, 70 మొబైల్‌ బూత్‌లు అందుబాటులో ఉంచారు. వీటిలో 61 గ్రామీణ మొబైల్‌ బూత్‌లు, 9 పట్టణ మొబైల్‌ బూత్‌లు ఉన్నాయి. జిల్లాలో గుర్తించిన 125 మారుమూల ప్రాంతాల్లోని 2,752 మంది చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే 49 మురికివాడల్లో నివసిస్తున్న 567 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 5,481 మంది వ్యాక్సినేటర్లు, 147 మంది పర్యవేక్షకులు సేవలందించనున్నారు. వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా కోసం 49 కోల్డ్‌ చైన్‌ యూనిట్లు సిద్ధంగా ఉంచారు. కార్యక్రమం కోసం 2,49,600 బై-వేలెంట్‌ ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ డోసులు కేటాయించారు. ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు సమీప పోలియో బూత్‌లకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి హైమావతి కోరారు.

Updated Date - Jun 28 , 2026 | 12:33 AM