Share News

విద్యా సంస్థల్లో సీట్లన్నీ భర్తీ కావాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:42 AM

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, వివిధ యాజమాన్యాల పరిధిలోని గురుకుల పాఠశాలలు/ కళాశాలల్లో ఖాళీగా వున్న సీట్లను సత్వరమే భర్తీ చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

విద్యా సంస్థల్లో సీట్లన్నీ భర్తీ కావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

విద్యార్థులకు వారానికోసారి హెల్త్‌ చెకప్‌

తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి

విద్యా శాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, వివిధ యాజమాన్యాల పరిధిలోని గురుకుల పాఠశాలలు/ కళాశాలల్లో ఖాళీగా వున్న సీట్లను సత్వరమే భర్తీ చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌ నుంచి ఎంఈఓలు, ఇతర విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, బడి బయట ఉన్న పిల్లలు, సంచార జాతుల పిల్లలను గుర్తించి వెంటనే సమీపంలోని విద్యా సంస్థల్లో చేర్చాలని సూచించారు. ఈ విషయంలో ఎంపీడీవోలు, స్వర్ణ వార్డు/ పంచాయతీు ఉద్యోగులతో సమన్వయం చేసుకుని అడ్మిషన్లు పెంచాలని కోరారు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో సీట్లన్నీ భర్తీ అయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని విద్యా సంస్థల్లో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, సమీపంలోని పీహెచ్‌సీ వైద్యులతో మాట్లాడి వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఏఎన్‌ఎంలతో హెల్త్‌ చెకప్స్‌ నిర్వహించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ఆర్‌వో ప్లాంట్లు ఉన్నప్పటికీ నీటిని బాగా మరిగించి, చల్లార్చిన తర్వాతే పిల్లలకు ఇవ్వాలని, వాటర్‌ టెస్టింగ్‌ కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించి ఆ డేటాను సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. విద్యార్థులను దుర్భాషలాడడం, కొట్టడం, వివక్ష చూపడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. వసతిగృహాల్లో మెనూ పక్కాగా అమలు చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఈవో అప్పారావునాయుడు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:42 AM