రాత్రంతా బిక్కుబిక్కుమంటూ..
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:09 PM
మన్యంలో శనివారం రాత్రి 11.30 గంటలకు ఒక్కసారిగా అలజడి రేగింది. ఇళ్లు కంపించడం, వస్తువులు కింద పడిపోతుండడంతో ఏం జరిగిందో తెలియక జనం భయంతో బయటకు పరుగులు తీశారు.
మన్యంలో శనివారం రాత్రి భూమి కంపించడంతో రోడ్లపైకి చేరిన జనం
ఏం జరుగుతుందోననే భయంతో ఆరుబయటే జాగారం
అరకులోయ/ముంచంగిపుట్టు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం రాత్రి 11.30 గంటలకు ఒక్కసారిగా అలజడి రేగింది. ఇళ్లు కంపించడం, వస్తువులు కింద పడిపోతుండడంతో ఏం జరిగిందో తెలియక జనం భయంతో బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిందని తెలిసి అలా బయటకు వచ్చిన వారు రాత్రంతా రోడ్లపైనే ఉన్నారు. జిల్లాలోని పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, తదితర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో శనివారం 11.30 గంటలకు భూమి కంపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొందరు నిద్రించగా, మరికొందరు టీవీలు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా భూమి కంపించింది. సుమారు 30 సెకన్లపాటు ఇళ్లు కదిలిపోయాయి. ఇళ్లల్లోని వస్తువులు కిందపడిపోయాయి. జనంలో ఆందోళన మొదలైంది. అందరూ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశారు. కొన్నిచోట్ల సెకన్ల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇక మన్యానికి వచ్చిన పర్యాటకులు భయాందోళన చెందారు. ముఖ్యంగా అరకులోయలోని మసీదు రోడ్డు, కొండవీధి, రజకవీధి, సీఏహెచ్ స్కూల్ సమీపంలోని కాలనీ వాసులు రోడ్డుపైకి వచ్చేసి ఒకేచోట చేరి కాలక్షేపం చేశారు. మళ్లీ భూమి కంపిస్తుందేమోననే భయంతో ఆదివారం ఉదయం వరకు ఆరుబయటే ఉన్నారు. ముంచంగిపుట్టు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి 11.30 గంటలకు భూమి కంపించడంతో జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో నిద్రిస్తున్న వారితో పాటు మెలకువగా ఉన్నవాళ్లు ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళన చెందారు. భూమి కంపించిందని తెలిసి రాత్రంతా రోడ్లపైనే ఉన్నారు. రెండేళ్ల క్రితం ఇదే తరహాలో పట్టపగలు భూమి కంపించింది. అప్పట్లో ఒడిశాలో భూకంపం రావడంతో ఆ ప్రభావం మండలంపై చూపించింది. ఒడిశాను ఆనుకొని మండలం ఉండడం వలన అక్కడ ఎప్పుడు భూకంపం వచ్చినా ఆ ప్రభావం ఈ ప్రాంతంపై ఉంటోందని స్థానికులు తెలిపారు.