Share News

అందరి చూపు జడ్పీ వైపు!

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:35 AM

ఇన్నాళ్లూ ఉమ్మడి విశాఖపట్నంలో ఉండే జిల్లా పరిషత్‌... ఇకపై కొత్త జిల్లాల వారీగా ఏర్పడడంతో అన్ని రాజకీయ పార్టీల చూపు దానిపైనే పడింది. పాడేరు కేంద్రంగా 2022లోనే నూతన జిల్లా ఏర్పడినప్పటికీ ఈ ఏడాది జిల్లా పరిషత్‌ ఏర్పడడంతో రానున్న ఎన్నికల్లో చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అటు అధికార పక్షం, ఇటు విపక్షం సైతం పోటా పోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

అందరి చూపు జడ్పీ వైపు!
పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ తాత్కాలిక కార్యాలయం

- కొత్తగా ఏర్పాటు కావడంతో ఆసక్తి

- గెలిస్తే చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆశ

- కూటమి పాలనలో జిల్లా పరిషత్‌కు మంచి రోజులు

- పీఠం కోసం అధికార, విపక్షాల పోటా పోటీ యత్నాలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఇన్నాళ్లూ ఉమ్మడి విశాఖపట్నంలో ఉండే జిల్లా పరిషత్‌... ఇకపై కొత్త జిల్లాల వారీగా ఏర్పడడంతో అన్ని రాజకీయ పార్టీల చూపు దానిపైనే పడింది. పాడేరు కేంద్రంగా 2022లోనే నూతన జిల్లా ఏర్పడినప్పటికీ ఈ ఏడాది జిల్లా పరిషత్‌ ఏర్పడడంతో రానున్న ఎన్నికల్లో చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అటు అధికార పక్షం, ఇటు విపక్షం సైతం పోటా పోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

జిల్లాలోని ప్రతి మండలంలో జడ్పీటీసీ స్థానాలను గెలుపొందాలనే లక్ష్యంతో కూటమి, వైసీపీ నేతలు ముమ్మరంగా వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే దానికి అనుగుణంగా తమ అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలున్నాయి. అయితే రిజర్వేషన్ల ఖరారుకు అనుగుణంగానే ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున అభ్యర్థులను పరిశీలనలో ఉంచారు. దీంతో జిల్లాలోని పదకొండు మండలాల్లోని జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జడ్పీ పీఠంపై గురి

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లుగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వంజంగి కాంతమ్మ, జల్లిపల్లి సుభద్రలు బాధ్యతలు నిర్వర్తించడంతో జడ్పీ పీఠంపై మన్యంలోని అన్ని పార్టీల నేతల దృష్టి ఉంది. ఈ తరుణంలో జిల్లాలోనే జిల్లా పరిషత్‌ ఏర్పాటు కావడంతో అది మరింతగా బలపడింది. దీంతో పార్టీలతో పాటు మండలాల్లో సైతం తాము జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆశ అన్ని పార్టీల నేతల్లోనూ బలంగా నాటుకుంది. ఇన్నాళ్లూ ఏజెన్సీలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే తాజాగా జిల్లా పరిషత్‌ పీఠంపైనా అధికంగా ఆశలు పెట్టుకుంటున్నారు. అలాగే ఆయా పార్టీల అధిష్టానాలు సైతం ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని జడ్పీ చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతోనే చాపకింద నీరులా ఎవరి వ్యూహాలు వాళ్లు పన్నుతున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావనలో జడ్పీ పీఠంపైనే అధికంగా జిల్లాలో చర్చ జరుగుతున్నది.

Updated Date - Oct 14 , 2026 | 12:35 AM