Share News

విశాఖ వైపే అందరి చూపు

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:51 AM

ఉద్యోగుల విభజనకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. అయితే పొరుగు జిల్లాల నుంచి పలువురు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు విశాఖపట్నం రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

విశాఖ వైపే అందరి చూపు

జిల్లాకు వచ్చేందుకు పొరుగు జిల్లాల తహశీల్లార్లు, డిప్యూటీ తహశీల్దార్లు మొగ్గు

సీనియారిటీయే ప్రామాణికం

ఉద్యోగుల విభజనం కోసం ఇప్పటికే జాబితాల తయారీ

మెజారిటీ తహశీల్దార్లకు స్థానచలనం

జూనియర్లు అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు

విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

ఉద్యోగుల విభజనకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. అయితే పొరుగు జిల్లాల నుంచి పలువురు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు విశాఖపట్నం రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తహశీల్దారు పోస్టులకు ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు మల్టీ జోన్‌ (జోన్‌ 1, 2)గా పరిగణిస్తారు. రెండు జోన్‌లలో ఏ జిల్లాకైనా ఆప్షన్‌ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే జోన్‌-1లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని పలువురు తహశీల్దార్లు విశాఖకు ఆప్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.

ఉద్యోగుల విభజన కోసం విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీనియారిటీ జాబితాలు రూపొందించారు. మల్టీ జోన్‌లో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. రాష్ట్రంలో రెవెన్యూపరంగా విశాఖ జిల్లా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉండడంతో ఇక్కడ పనిచేయడానికి అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో మూడు నెలల కాలానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి విశాఖ వచ్చిన తహశీల్దార్లు కొందరు ఇక్కడే ఉండిపోవాలని యత్నించిన సందర్భాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో నగరానికి ఆనుకుని ఒక మండలానికి వచ్చిన తహశీల్దారు ఇక్కడే కొనసాగడానికి అమరావతి స్థాయిలో పైరవీ చేశారు. అటువంటి వారంతా ఇప్పుడు విశాఖ రానున్నారని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. అదేవిధంగా డిప్యూటీ తహశీల్దార్లు కూడా జోన్‌ పరిధిలో ఎక్కడికైనా వెళ్లవచ్చు. అందువల్ల విజయనగం జిల్లాలో పనిచేస్తున్న పలువురు సీనియర్‌ డీటీలు విశాఖ వస్తున్నట్టు ఇక్కడ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. విశాఖ జిల్లాకు వస్తే డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి వచ్చేంత వరకు ఇక్కడే నగరం, దానికి ఆనుకుని నాలుగు మండలాల్లోనే పనిచేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

విశాఖ జిల్లాలోని 11 మండలాలు, కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాలు, భూసమీకరణ, భూ పరిరక్షణ, వీఎంఆర్‌డీఎ, జీవీఎంసీ, పోర్టులో తహశీల్దారు క్యాడర్‌ అధికారులు ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 50 మంది వరకు తహశీల్దారు కేడర్‌ అధికారులు ఉన్నారు. వీరిలో ఐదు నుంచి ఏడుగురు వరకు సీనియర్లు ఉండగా, మిగిలిన వారు జూనియర్‌లని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పలువురు సీనియర్‌ తహశీల్దార్లు విశాఖపట్నం రావడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న వారిలో ఐదు నుంచి ఏడుగురు తప్ప మిగిలిన వారంతా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వెళ్లడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మండలాల్లో పనిచేసే వారిలో నలుగురు తప్ప మిగిలిన వారంతా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఉన్నవారిలో కొందరికంటే జూనియర్లుగా పేర్కొంటున్నారు. వీరంతా అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వెళితే అక్కడ నుంచి, ఇంకా మల్టీ జోన్‌ నుంచి వచ్చే వారిలో సీనియర్లకు విశాఖలో పోస్టింగ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికితోడు జూనియర్లు కూడా అనకాపల్లి, అల్లూరి వెళ్లాల్సి ఉంటుందంటున్నారు.

Updated Date - Jul 18 , 2026 | 01:51 AM