మానవ అక్రమ రవాణాపై అప్రమత్తం
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:13 AM
మానవ అక్రమ రవాణా వంటి నేరాల పట్ల పోలీసు అఽధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పీ అమిత్‌బర్దార్ సూచించారు.
పోలీసు అధికారులకు ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆదేశం
పాడేరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా వంటి నేరాల పట్ల పోలీసు అఽధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పీ అమిత్‌బర్దార్ సూచించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనపై మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో వివిధ రూపాల్లో మానవ అక్రమ రవాణా జరుగుతుంటుందని, వాటిని గుర్తించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు తమదైన శైలిలో విచారణలు, దర్యాప్తులు చేపట్టి మానవ అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. అదే క్రమంలో ఆయా నేరాలకు సంబంధించి ఆధారాలు, సాక్ష్యాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి కోర్టులో కేసు నిలబడేలా చూడాలని ఆదేశించారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేర నిర్ధారణ, ఆయా కేసుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఉపాధి పేరిట జిల్లాలోని అమాయక గిరిజనులను మోసగించే ఘటనలపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించి ఇతర శాఖల సమన్వయంతో బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కడైనా మానవ అక్రమ రవాణా జరిగితే తక్షణమే 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను ఎస్‌పీ కోరారు. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా నియంత్రణపై పోలీసులకు అవసరమైన సలహాలు, సూచనలు, మెళకువలను, తమ అనుభావాలను సీనియర్ అడ్వకేట్ రవితేజ, ఎన్‌జీవో ప్రతినిధులు జి.హేమలత, రాహుల్ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పీ వై.శృతి, డీఎస్‌పీ వేణుగోపాల్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.