భారీ వర్షాల పట్ల అప్రమత్తం
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:06 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు.
అధికారులు, ప్రజలకు కలెక్టర్ టి.నిషాంతి సూచన
నేడు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు సెలవు
పాడేరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆమె మంగళవారం వీడియో, టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో ప్రతి మండలంలోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వర్షాల ప్రభావంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే తక్షణమే కలెక్టరేట్‌కు సమాచారం అందించాలని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రజలు సైతం వర్షాల కురుస్తున్న సమయంలో గెడ్డలు, వాగులు దాటవద్దని, ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని కలెక్టర్ కోరారు. తాజా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నామని, ఈ మేరకు మండల స్థాయి అధికారులకు జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే.పరిమిళ ఆదే శాలు జారీ చేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ, తమ పిల్లలను ఇళ్లలోనే సురక్షితంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో అధిక సంఖ్యలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
వాయుగుండం నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజల సౌకర్యార్ధం కలెక్టర్ నిషాంతి అధిక సంఖ్యలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసర సహాయం, సమాచారానికి ఆయా కంట్రోల్ రూమ్‌ల నంబర్లు 9391319286, 7095239800, 9440603641, 7382323241, 9493415670, 7981301820, 7780137849, 6302604213, 9494372648, 9014350957, 9121413829, 7981056206కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయా కంట్రోల్ రూమ్‌ల్లో నియమించిన సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు.