Share News

వరదలతో అప్రమత్తం

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:22 PM

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో వరదల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలు చేపడుతున్నదని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను గురువారం ఆమె విలేకరులకు తెలిపారు.

వరదలతో అప్రమత్తం
కలెక్టర్‌ టి.నిషాంతి

కలెక్టర్‌ టి.నిషాంతి

నేడు కూడా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సెలవు

పాడేరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం నేపథ్యంలో వరదల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలు చేపడుతున్నదని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను గురువారం ఆమె విలేకరులకు తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినప్పటి నుంచి మండల, పంచాయతీ, గ్రామస్థాయిల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, భారీ వర్షాల కారణంగా ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే రోడ్లు, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించకుండా, నిత్యవసర వస్తువులకు కొరత ఏర్పడకుండా అధికారులకు తగిన సూచనలిచ్చామన్నారు. ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలతో గెడ్డలు, వాగుల స్థితిగతులను అంచనా వేయడం, కొండచరియల ప్రమాదాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి చేపట్టామన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. భారీ వర్షాలకు ఎక్కడైనా రోడ్లు, కల్వర్టులు వంటివి దెబ్బతిన్నా, రోడ్లపై చెట్లు విరిగిపడినా తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యుత్‌, తాగునీరు, అత్యవసర వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంతో పాటు పరిస్థితులను బట్టి పలువురు గర్భిణులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. తాగునీటి వనరులు కలుషితం కాకుండా చూడడం, క్లోరినేషన్‌ పనులు చేపట్టడంతో పాటు ప్రజలకు తక్షణ రక్షణ, సహాయక చర్యలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశామన్నారు. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:23 PM