అప్రమత్తం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:17 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు
మండలాల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
అనకాపల్లి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం వుండడంతో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ నుంచి మండలాల ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వాతావరణ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం వుంటున్న వారిని అవసరమైతే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని రహదారులపై గుంతలను పూడ్చాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డుల సిబ్బంది, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యవసర సేవలకు సంబంధించి వాహనాలు, సిబ్బంది ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈపీడీసీఎల్ అధికారులు తమ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్లను పరిశీలించి, విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని చెప్పారు. భారీ వర్షాల ప్రభావం తగ్గిన తరువాత రహదారులు, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్‌ఓ వై.సత్యనారాయణరావు, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పొల్గొన్నారు.
తేలికపాటి జల్లులు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరు జల్లులు పడ్డాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు సగటున 2.4 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా అచ్యుతాపురం మండలంలో 19.2 మి.మీ. వర్షం కురిసింది. ఎలమంచిలిలో 11.6 మి.మీ., పాయకరావుపేటలో 11.2 మి.మీ., చోడవరంలో 5.6, అనకాపల్లిలో 5.4, ముగనపాకలో 2.4, కె.కోటపాడులో 2.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, పరవాడ, బుచ్చెయ్యపేట, కోటవురట్ల, మాకవరపాలెం, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.