Share News

రూ.415.08 కోట్లతో జల్‌ జీవన్‌ పనులు

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:53 PM

ఉమ్మడి అల్లూరి జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.415.08 కోట్లతో 5,498 మంచినీటి పథకాలు నిర్మిస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) బీవీవీ నాగేశ్వరరావు తెలిపారు.

రూ.415.08 కోట్లతో జల్‌ జీవన్‌ పనులు
ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడుతున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ బీవీవీ నాగేశ్వరరావు

ఉమ్మడి అల్లూరి జిల్లాలో నిర్మాణాలు వేగవంతం

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ బీవీవీ నాగేశ్వరరావు

చింతపల్లి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి అల్లూరి జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.415.08 కోట్లతో 5,498 మంచినీటి పథకాలు నిర్మిస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) బీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన చింతపల్లి మండలంలో పర్యటించిన జేజేఎం నిర్మాణాలను పరిశీలించారు. స్థానిక సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాల నిర్మాణాలను వేగవంతం చేశామన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదన్నారు. నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో 5,498 జేజేఎం పనులకు గాను ఇప్పటి వరకు 3,494 పనులు పూర్తి చేశామని తెలిపారు. 769 పనులు నిర్మాణ దశలో ఉన్నాయని, 324 నిర్మాణాలు ప్రారంభించాల్సి వుందని, 911 నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికి రూ.113.76 కోట్లు ఖర్చు చేశామన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు పూర్తిస్థాయిలో రన్నింగ్‌ వాటర్‌, మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం రూ.11.19 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో 373 పాఠశాలల్లో సెంటర్‌ శానిటరీ కాంప్లెక్స్‌(సీఎస్‌సీ)లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 81 పాఠశాలల్లో సీఎస్‌సీలు నిర్మించామని, మరో 292 సీఎస్‌సీలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. డిసెంబరు నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. చింతపల్లిలో రూ.22 కోట్లతో మెగా రక్షిత మంచినీటి ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా చింతపల్లి మేజర్‌ పంచాయతీ పాటు ఐదు పంచాయతీల్లోని 81 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ పథకం నిర్మాణ పనులు మార్చి నాటికి పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ వై.ఆనంద్‌, చింతపల్లి, జీకేవీధి ఏఈఈలు గడుతూరి స్వర్ణలత, కల్యాణ్‌రామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:53 PM