అక్వాన్ అలజడి
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:01 AM
‘అక్వాన్’ తుఫాన్ విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనున్నది.
విశాఖపై తుఫాన్ ప్రభావం
నేడు వర్షసూచన
రేపు, ఎల్లుండి భారీవర్షాలు
21న కూడా కొనసాగే అవకాశం
70 నుంచి 80 కి.మీ. వేగంతో పెనుగాలు
19, 20 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
‘అక్వాన్’ తుఫాన్ విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనున్నది. తుఫాన్ విశాఖపట్నం-బాపట్ల నడుమ కాకినాడ సమీపాన తీరం దాటవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మంగళవారం సాయంత్రానికి విశాఖకు 650 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. సముద్రంలోనే ఉత్తర వాయువ్యం నుంచి వాయువ్యంగా దిశ మార్చుకుంటున్న క్రమంలో బుధవారం నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు ప్రారంభం కానున్నాయి.
నగరంలో బుధవారం మేఘాలు ఆవరించి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాత్రి నుంచి గాలుల వేగం పెరిగి గురువారం నాటికి 80 కిలోమీటర్లకు చేరుకోవచ్చునని వెల్లడించింది. 19వ తేదీన భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని, 20వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. అయితే తుఫాన్ తీరం దాటే సమయంలో ఈశాన్య భాగం నుంచి వచ్చే తేమగాలులతో 21వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలులు 70 నుంచి 80 కి.మీ. వేగంతో వీచినా చెట్లు, కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉంది. అక్టోబరు 28 నుంచి వారం వ్యవధిలో సంభవించిన రెండు తుఫాన్లతో నగరంలో చాలా చెట్లు నేలకూలాయి. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తుఫాన్ తీరం దాటే క్రమంలో కొంత బలహీనపడినా గాలుల వేగం 80 కి.మీ.కు తగ్గదని వివరించారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న రిజర్వాయర్లకు మరింత వరద వస్తోంది. ఈ నేపథ్యంలో జల వనరులు, జీవీఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలావుండగా తుఫాన్ కాకినాడ, విశాఖ మధ్య తీరం దాటితే మాత్రం నగరంపై మరింత ఎక్కువ ప్రభావం పడుతుందని రిటైర్డు వాతావరణ అధికారి ఒకరు పేర్కొన్నారు. గురువారం నుంచి 21వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశాలు)
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం జిల్లాలో రానున్న మూడు రోజులు భారీవర్షాలు కురుస్తాయని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో 18న ఒక మోస్తరు వర్షాలు పడే సూచన ఉందని, 19, 20 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుఫాన్ ప్రభావంతో 100 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రజలు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని, అప్రమత్తం చేశామని, పల్లపు ప్రాంతాలు, కొండ వాలు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.
వేటకు వెళ్లొద్దు
బోట్లన్నీ జాగ్రత్తగా లంగరు వేసుకోండి
మత్స్య శాఖ జెడీ వర్దన్
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
అక్వాన్ తుఫాన్ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, వెళ్లిన వారు వెంటనే వెనక్కి రావాలని మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ వర్దన్ విజ్ఞప్తిచేశారు. ఆయన మంగళవారం ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లి మత్స్యకార సంఘాల నాయకులతో మాట్లాడారు. ప్రతి బోటు హార్బర్‌లో కానీ, ల్యాండింగ్ సెంటర్‌లోగానీ జాగ్రత్తగా లంగరు వేయాలన్నారు. హార్బర్‌లో మెకనైజ్డ్ బోట్ల మధ్య ఫైబర్ బోట్లను నిలపవద్దని, తుఫాన్ గాలులకు అవి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మత్స్యకారులు బోట్లు, వేట పరికరాలు, ఆక్వా కల్చర్ ఆస్తుల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్నీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలన్నారు. తీవ్రమైన గాలులు, అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోట్లను నిలిపేటప్పుడు వాటి మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలన్నారు. ఒక దానితో మరొకటి తగిలేలా పెడితే నష్టం జరుగుతుందన్నారు. బోట్లలో ఇంజన్లు, బ్యాటరీలు, కమ్యూనికేషన్ పరికరాలన్నీ తొలగించి జాగ్రత చేసుకోవాలన్నారు. వలలను కూడా ఇళ్లకు తీసుకువెళ్లి పెట్టుకోవాలని సూచించారు. ఈ నాలుగు రోజులు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని కోరారు. అధికారులకు సహకరించాలన్నారు.