Share News

సాగర్‌నగర్‌లో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం రేపు

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:04 AM

సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు/అధికారులు, ప్రజలకు మధ్య వారధిగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించతలపెట్టిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఈనెల నాలుగో తేదీ (శనివారం)న నగరంలోని భీమిలి నియోజకవర్గ పరిధిలో గల సాగర్‌నగర్‌లో జరగనున్నది.

సాగర్‌నగర్‌లో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం రేపు

  • వేదిక: కాలనీలోని శివాలయం సమీపాన గల ఎస్‌ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాలు

  • సమయం: ఉదయం 9.30 గంటల నుంచి...

    విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):

సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు/అధికారులు, ప్రజలకు మధ్య వారధిగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించతలపెట్టిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఈనెల నాలుగో తేదీ (శనివారం)న నగరంలోని భీమిలి నియోజకవర్గ పరిధిలో గల సాగర్‌నగర్‌లో జరగనున్నది. కాలనీ లోని శివాలయం సమీపాన గల ఎస్‌ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాలులో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరుకానున్నారు. జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్‌, ఈపీడీసీఎల్‌, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు, స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొంటారు. కాలనీలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై చర్చించి అభివృద్ధికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.


సమస్యల సాగరం

సాగర్‌నగర్‌లో కనీస సదుపాయాలు లేని పార్కులు

ఎక్కడికక్కడ పూడుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థ

అరకొరగా తాగునీటి సరఫరా

శిథిలావస్థలో రోడ్లు

వెలగని వీధి దీపాలు

సాగర్‌నగర్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా మూడున్నర దశాబ్దాల క్రితం ఏర్పడిన సాగర్‌నగర్‌లో ప్రస్తుతం సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రశాంతంగా ఉండే సాగర్‌నగర్‌లో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు. మొత్తం 1,234 ఇళ్లతో 1993లో ప్రారంభమైన సాగర్‌నగర్‌లో గల పార్కుల్లో ఎటువంటి సదుపాయాలు లేవు. కాలనీ ఏర్పాటు సమయంలో నిర్మించిన మురుగునీటి వ్యవస్థను ఇంతవరకు ఆధునికీకరించలేదు. మంచినీటి సమస్య కూడా ఉంది. రోడ్లు దాదాపు శిథిలావస్థకు చేరాయి. రాత్రిపూట చాలాచోట్ల వీధిలైట్లు వెలగడం లేదు. బస్సులు కూడా సరిగా లేవు.

పార్కుల్లో వసతులు కల్పించాలి

సాగర్‌నగర్‌ పరిధిలో ఏడు పార్కులు ఉన్నాయి. ఏ పార్కులో కూడా కనీస వసతులు లేవు. కొన్నింటిలో వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. పార్కుల్లో వాకింగ్‌ ట్రాక్‌, వ్యాయామ పరికరాలు, చిన్నపిల్లల ఆట వస్తువులు ఏర్పాటుచేస్తే ఉపయోగంగా ఉంటుంది. నగరంలోని గ్రీన్‌బెల్టుల్లో మాదిరిగా తమ కాలనీలో గల పార్కుల్లో వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేయాలి

కాలనీ ఏర్పాటైనప్పుడు అన్ని వీధులను అనుసంధానం చేస్తూ మురుగునీటి వ్యవస్థ నిర్మించారు. అయితే ఆ డ్రైనేజీపై కొందరు పలకలు వేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో చెత్త తొలగించేందుకు వీలులేక దుర్గంధం వెదజల్లుతోంది. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు ఎదురుగా ఉన్న మురుగుకాల్వ నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా మార్పులుచేసి కొత్తగా నిర్మించాల్సి ఉంది. కాల్వలపై ఆక్రమణలు తొలగించాలి.

నీటి సరఫరా పెంచాలి.. రోడ్లు బాగుచేయాలి

కాలనీ ఏర్పాటు సమయంలో 1,234 ఇళ్లలో నివసించే జనాభాకు తగిన విధంగా నగర పాలక సంస్థ తాగునీరు సరఫరా చేసింది. మూడున్నర దశాబ్దాలలో జనాభా పెరిగినా నీటి సరఫరాను పెంచలేదు. దీంతో అరకొరగా వచ్చే నీరు సరిపోవడం లేదు. ఈ ప్రాంతంలో అక్కడక్కడా ఫ్లోరైడ్‌ సమస్య కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్యాంకు పక్కన సంప్‌ నిర్మించి దాని నుంచి సరఫరా పెంచాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇంకా అన్ని వీధులు, ప్రధాన మార్గంలో రహదారుల పునర్నిర్మాణం, మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ప్రధాన రహదారిలో డివైడర్‌ ఏర్పాటుచేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి సమయంలో వీధి లైట్లు వెలగకపోవడంతో చీకట్లు అలముకుంటున్నాయి. ఆకతాయిల బెడద ఉంది. ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా అవసరమైన సమయాల్లో అందుబాటులో లేవు. బస్సు కోసం బీచ్‌రోడ్డుకు రావలసి వస్తోంది. ప్రజలకు అనుకూలంగా బస్సులు నడపాల్సి ఉంది. పోలీసుల అవుట్‌పోస్టు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 01:05 AM