అఖిల్ అజేయ సెంచరీ
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:17 AM
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా శనివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ 52 పరుగుల తేడాతో పంజాబ్ దే షేర్‌పై విజయం సాధించింది.
పంజాబ్‌పై తెలుగు వారియర్స్ గెలుపు
విశాఖపట్నం-స్పోర్ట్స్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా శనివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ 52 పరుగుల తేడాతో పంజాబ్ దే షేర్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు అశ్విన్‌బాబు అర్ధ సెంచరీ (60)తో రాణించగా, అఖిల్ అక్కినేని అజేయ సెంచరీ (101)తో చెలరేగాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి కేవలం 56 బంతుల్లో ఏడు బౌండరీలు, ఆరు సిక్సర్లతో సెంచరీ (101) పూర్తిచేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ దే షేర్ బౌలర్ రౌనక్‌సింగ్ రెండు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో పంజాబ్ దే షేర్ 18.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కరణ్ వాహి హాఫ్ సెంచరీ (56), హార్ది సందు (28) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. తెలుగు వారియర్స్ బౌలర్లలో వినయ్ మహదేవ్ మూడు, సామ్రాట్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టారు. రఘురాజు, అశ్విన్‌బాబు, నిఖిల్ దేవదుల తలో వికెట్ తీశారు.
ముంబై హీరోస్‌పై బెంగాల్ టైగర్స్ గెలుపు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా శనివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ నాలుగు వికెట్ల తేడాతో ముంబై హీరోస్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై హీరోస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 199 పరుగులు చేసింది. షబ్బీర్ అలువాలియా హాఫ్ సెంచరీ (57), నిశాంత్ దహియా (31), తోమర్ నవదీప్ (43) రాణించారు. బెంగాల్ టైగర్స్ బౌలర్లలో జాయ్‌కుమార్ ముఖర్జీ మూడు, రణదీప్ జోష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ టైగర్స్ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లకు 203 పరుగులు చేసి విజయం సాధించింది. వన్‌డౌన్‌లో వచ్చిన జమ్మీ బెనర్జీ (97) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి కేవలం 46 బంతుల్లో మూడు బౌండరీలు, 10 సిక్సర్లతో 97 పరుగులు చేశాడు. లోయర్ డౌన్‌లో రాహుల్ ముజందర్ (44) రాణించి జట్టుకు విజయాన్నందించాడు. ముంబై హీరోస్ బౌలర్ నిశాంత్ దహియ రెండు వికెట్లు పడగొట్టాడు.