Share News

గిరిజన యువతకు ఏఐ నైపుణ్యం

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:46 AM

గిరిజన యువతకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంసిద్ధులను చేస్తున్నామని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ అన్నారు.

గిరిజన యువతకు ఏఐ నైపుణ్యం
ఆరోహణ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం

చింతపల్లి వైసీటీలో ఆరోహణ సెంటర్‌ ప్రారంభం

పాడేరురూరల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

గిరిజన యువతకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంసిద్ధులను చేస్తున్నామని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ అన్నారు. సోమవారం చింతపల్లి యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (వైటీసీ)లో ఏఐ ఫెలోషిప్‌ రెసిడెన్షియల్‌ శిక్షణ ఆరోహణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఆరోహణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డిజిటల్‌ స్కిల్స్‌, డేటా అనలిటిక్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీలపై ప్రాక్టికల్‌ అవగాహన కల్పిస్తారన్నారు. బోధన విధానంలో భాగంగా ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం, ప్రాక్టికల్‌ సెషన్లు, కెరీర్‌ గైడెన్స్‌లు ఉంటాయన్నారు. మొదటి బ్యాచ్‌గా 50 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత బోర్డింగ్‌, లాడ్జింగ్‌ వసతులతో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆరోహణ కార్యక్రమాన్ని ఐటీడీఏ ఆధ్వర్యంలో ఫైన్టీ ఇనోవేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ భాగస్వామిగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో హేమలత, ఫైన్టీ ఇనోవేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ సహ వ్యవస్థాపకులు రోషన్‌, ఐటీడీఏ అధికారులు, శిక్షణ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:46 AM