Share News

ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:36 AM

కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించుకుని ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం పైలట్‌ ప్రాజెక్టులను కూడా ప్రారంభించింది. ఇందులో రెండింటిని ఆంధ్ర మెడికల్‌ కళాశాల పరిధిలోని ఘోష ఆస్పత్రికి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి కేటాయించింది. ఈ రెండు చోట్ల విభిన్నమైన సమస్యలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఆస్పత్రుల్లో  ఏఐ సేవలు

ఘోష, మానసిక వైద్యశాలల్లో ప్రారంభమైన పైలట్‌ ప్రాజెక్టులు

ఒకచోట గర్భిణులకు సీటీజీ పరీక్ష ద్వారా సమస్యలు గుర్తింపు

మరోచాట సాధారణ, మధ్యస్థ ఆటిజంతో బాధపడే చిన్నారులకు థెరపీ

పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న వైద్యులు

వాటి ఆధారంగా మిగిలినచోట్ల ప్రారంభించే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించుకుని ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం పైలట్‌ ప్రాజెక్టులను కూడా ప్రారంభించింది. ఇందులో రెండింటిని ఆంధ్ర మెడికల్‌ కళాశాల పరిధిలోని ఘోష ఆస్పత్రికి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి కేటాయించింది. ఈ రెండు చోట్ల విభిన్నమైన సమస్యలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

గర్భిణికి సీటీజీ (కార్డియోటోకోగ్రఫీ) టెస్ట్‌ను నిర్వహించే ప్రాజెక్టును ప్రభుత్వ విక్టోరియా జార్జ్‌ ఆస్పత్రి(ఘోష)కి మంజూరు చేసింది. సాధారణంగా సీటీజీ పరీక్షను పరికరం సహాయంతో నిర్వహిస్తారు. గ్రాఫ్‌ రూపంలో వచ్చే ఈ రిపోర్టును వైద్యులు పరిశీలించి గర్భంలోని శిశువు గుండె ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై ఒక స్పష్టతకు వస్తారు. ప్రసవం చేయవచ్చా?, లేదా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అనేది స్తారు. అయితే, పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఏఐ ఆధారిత సీటీజీ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష పూర్తయిన వెంటనే శిశువు గుండె చప్పుడు, తల్లి గర్భాశయ సంకోచాలు...ఒక గ్రాఫ్‌ రూపంలో రావడమే కాకుండా డెలివరీ చేయాలా?, వద్దా?...అనే విషయం కూడా వెల్లడిస్తుంది. డెలివరీ ఎందుకు చేయాలి?, ఎందుకు వద్దు...అనేది కూడా ఏఐ స్పష్టంగా వైద్యులకు తెలియజేస్తుంది. సీటీజీ నిర్వహణకు 20 నిమిషాలు సమయం పడుతుంది. గంటకు ముగ్గురికి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఘోషతో పాటు కేజీహెచ్‌లోని గైనిక్‌ విభాగంలో కూడా ఈ పరీక్ష చేస్తున్నారు. రెండు వారాల నుంచి ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఆయా ఫలితాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా చేసుకుని మిగిలినచోట్ల ఈ సేవలను అందించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఆటిజం చిన్నారులకు ఏఐ పరిష్కారం..

ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి ఒక ప్రాజెక్టును మంజూరుచేసింది. కాగ్నిటివ్‌ బోటిక్‌ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా సాధారణ, మధ్యస్థ ఆటిజం సమస్యతో బాధపడే 20 మంది చిన్నారులకు గడిచిన నెల రోజుల నుంచి అడ్జెంట్‌ థెరపీ ఇస్తున్నారు. ఈ సమస్యతో బాధపడే చిన్నారులు శబ్దాలకు స్పందించరు. కలర్స్‌ను గుర్తించరు. ఆటలు, ట్యాపింగ్‌ గేమ్స్‌ ద్వారా, మ్యాచింగ్స్‌ చేయడం వంటి విభిన్నమైన యాక్టివిటీస్‌ నిర్వహణ ద్వారా వారిలో స్కిల్స్‌ను పెంపొందిస్తారు. ఇందుకోసం ఒక ట్యాబ్‌ను వినియోగిస్తున్నారు. ఇందులోనే మొత్తం వారి యాక్టివిటీస్‌ నిర్వహిస్తారు. చిన్నారి పేరుతో ట్యాబ్‌ నుంచి శబ్దం వస్తుంది. అప్పుడు చిన్నారి ఐ కాంటాక్ట్‌ను ఏఐ గుర్తిస్తుంది. ఒకవేళ చిన్నారి చూడకపోతే వెంటనే అలర్ట్‌ చేసి పిలుస్తుంది. ఇంటికి వెళ్లిన తరువాత తల్లిదండ్రులు కూడా ఫోన్‌ సహాయంతో యాప్‌లో యాక్టివిటీస్‌ను ప్రాక్టీస్‌ చేయించే అవకాశాన్ని ప్రాజెక్టు నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఏఐ ఆధారిత అడ్జెంట్‌ థెరపీతో చిన్నారుల్లో దృష్టి, గ్రహణ సామర్థ్యాన్ని, అర్థం చేసుకునే తీరు, నేర్చుకునే విధానాలను బేరీజు వేసి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును మానసిక ఆస్పత్రిలోని చైల్డ్‌ సైకియాట్రీ డిపార్టుమెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో బిహేవియర్‌ అనలిస్ట్‌ ఎ.ట్రోఫీలోవ, థెరఫిస్టులు జి.నాగలక్ష్మి, ఎం.జ్ఞాపిక నిర్వహిస్తున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:36 AM