Share News

ట్రాఫిక్‌ నిర్వహణకు ఏఐ

ABN , Publish Date - May 31 , 2026 | 01:03 AM

విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సహకారంతో ట్రాఫిక్‌ నిర్వహించాలని ఎంతోకాలంగా పోలీసులు చేస్తున్న యత్నాలకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ట్రాఫిక్‌ నిర్వహణకు ఏఐ

రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ప్రాజెక్టు వ్యయం రూ.99.19 కోట్లు

సిగ్నల్స్‌ వద్ద సీసీ కెమెరాలు...అవి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం

నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్‌గా చలాన్‌ జారీ

నగరంలో 131.80 కి.మీ. పొడవున ఏర్పాట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సహకారంతో ట్రాఫిక్‌ నిర్వహించాలని ఎంతోకాలంగా పోలీసులు చేస్తున్న యత్నాలకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సిస్టమేటిక్‌ ఆగ్‌మెంటెడ్‌ రేడియల్‌ ట్రాఫిక్‌ అండ్‌ హూప్‌ ఇండక్షన్‌ (ఎస్‌ఏఆర్‌టీహెచ్‌ఐ) అని నామకరణం చేశారు. దీనికి రూ.99.19 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. ఇందులో 60 శాతం రూ.49.54 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రూ.20 కోట్లు సమకూర్చాల్సిందిగా వీఎంఆర్‌డీఏకు సూచించింది. మిగిలిన మొత్తాన్ని, ఐదేళ్ల నిర్వహణ నిధులను జీవీఎంసీ పెట్టుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా ఈ విధానంలో జారీచేసే చలాన్ల వసూళ్ల ద్వారా వచ్చే మొత్తాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.

ఎస్‌ఏఆర్‌టీహెచ్‌ఐకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తారు. ఈ కమిటీలో పోలీస్‌, జీవీఎంసీ, రవాణా, ఆర్టీసీ అధికారులు ఉంటారు. ప్రాజెక్టు పనులను కలెక్టర్‌ ప్రతి మూడు నెలలకొకసారి సమీక్షించాలని సూచించింది. అంతా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా చేయడానికి, ట్రాఫిక్‌ను సాఫీగా నడపడానికి, ప్రమాదాలను తగ్గించడానికి, భద్రత కోసం ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

ఏమి చేస్తారంటే...?

నగరంలో అన్ని జంక్షన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటిని ఏఐ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు కలుపుతారు. అక్కడి నుంచి అన్నీ పరిశీలిస్తారు. సిగ్నల్‌ జంపింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా బండి నడపడం, బెల్ట్‌ పెట్టుకోకుండా కారు డ్రైవ్‌ చేయడం, సరైన నంబరు ప్లేటు లేకుండా వెళ్లడం వంటి ఉల్లంఘలన్నింటినీ ఈ కెమెరాలు ఫొటోలు తీసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పంపుతాయి. అక్కడి నుంచి చలాన్లు జారీ అవుతాయి. జరిమానా వేస్తారు. ఎక్కడైనా ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంటే దాన్ని క్లియర్‌ చేయడానికి సూచనలు చేస్తారు. సిబ్బందిని పంపుతారు.

సిటీలో 101 ట్రాఫిక్‌ జంక్షన్లలో ఈ సాంకేతికతతో కూడిన సీసీ టీవీ కెమెరాలు పెడతారు. ప్రధానంగా నిబంధనలు ఉల్లంఘించే 90 జంక్షన్లు గుర్తించి వాటిపై దృష్టిసారిస్తారు. ట్రాఫిక్‌ సాఫీగా సాగిపోయే 14 జంక్షన్లు గుర్తించారు. వాటిపై మానటరింగ్‌ ఉంటుంది. సిటీలో మొత్తం 131.80 కి.మీ. పొడవున ఈ ఏఐ నిఘా ఉంటుంది. పాదచారుల భద్రతకు 12 ప్రాంతాలు గుర్తించారు. ఈ ప్రాజెక్టును జీవీఎంసీ అమలు చేస్తుంది.

Updated Date - May 31 , 2026 | 01:03 AM