Share News

రాయితీపై వ్యవసాయ యంత్రాలు

ABN , Publish Date - May 01 , 2026 | 12:13 AM

జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనిజేషన్‌ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద రైతులకు వ్యవసాయ యంత్రాలపై రాయితీ అందించనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ తెలిపారు.

రాయితీపై వ్యవసాయ యంత్రాలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ శ్రీపూజ

ఎస్సీ,ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీ

గరిష్ఠ రాయితీ రూ.50 వేలు

జిల్లాకు రూ.2.87 కోట్లు కేటాయింపు

జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనిజేషన్‌ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద రైతులకు వ్యవసాయ యంత్రాలపై రాయితీ అందించనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో చిన్న, సన్నకారు రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించనున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీ లభిస్తుందన్నారు. గరిష్ఠ రాయితీ పరిమితి రూ.50 వేలు ఉంటుందన్నారు. ట్రాక్టర్‌ (40హెచ్‌పీలోపు), పవర్‌ టిల్లర్లు, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ పరికరాలు, హార్వెస్టింగ్‌ యంత్రాలు, ట్రాక్టర్‌ డ్రాన్‌ ఇంప్లిమెంట్‌ వంటి 9 యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ పథకం కింద జిల్లాకు రూ. 2 కోట్ల 87 లక్షలు కేటాయించారన్నారు. అర్హత కలిగిన రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులు, గత మూడు సీజన్‌లలో ఈ-పంటలో నమోదైన సీసీఆర్‌సీ రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. 2024-25లో రాయితీ పొందిన రైతులు ఈ పథకానికి అనర్హులని ఆమె తెలిపారు.

జిల్లాలో ఇంధనం, గ్యాస్‌ కొరత లేదు

జిల్లాలోని 22 పెట్రోల్‌ బంకులలో డీజిల్‌, పెట్రోల్‌ సరిపడినంత నిల్వలు ఉన్నాయని జేసీ శ్రీపూజ అన్నారు. వాహన చోదకులు భయంతో ముందుగా బాటిల్స్‌, డ్రమ్స్‌లో నిల్వ చేసుకోవద్దన్నారు. అలా నిల్వ చేసుకున్న పెట్రోల్‌ బంక్‌ యజమాని, వినియోగదారులు ఎవరైనా శిక్షార్హులని హెచ్చరించారు. జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌, మండలాల్లో పోలీస్‌, రెవెన్యూ సంయుక్తంగా పర్యవేక్షిస్తుందన్నారు. గ్యాస్‌ వినియోగదారులు కూడా బుకింగ్‌ తర్వాత మెసైజ్‌ వచ్చిన కొద్ది రోజులకే గ్యాస్‌ లభ్యమవుతుందన్నారు. ప్రస్తుతం చిన్న, చిన్న ఇబ్బందులు ఉన్నాయని, త్వరలోనే వాటిని అధిగమిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి నందు, ఏవో భార్గవి పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:13 AM