Share News

పన్ను వసూళ్లలో దూకుడు

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:28 AM

ఆస్తిపన్ను వసూళ్లలో జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది దూసుకుపోతున్నారు.

పన్ను వసూళ్లలో దూకుడు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.552.50 కోట్లు వసూలు

జీవీఎంసీకి కలిసొచ్చిన ఆస్తి పన్ను వడ్డీ రాయితీ

గత ఏడాది కంటే రూ.116.3 కోట్లు అధికం

చివరి రెండురోజుల్లో మరో రూ.60 కోట్లు వసూలవుతుందని అంచనా

జోనల్‌కార్యాలయాలకు వెళ్లి పర్యవేక్షిస్తున్న కమిషనర్‌

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

ఆస్తిపన్ను వసూళ్లలో జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది దూసుకుపోతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో రూ.552.50 కోట్లు ఆస్తిపన్ను వసూలుచేశారు. గత ఏడాదితో పోల్చితే రూ.116.3 కోట్లు అధికం కావడం విశేషం. ఆస్తిపన్ను బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించడం, ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు రోజులే మిగిలివుండడంతోపాటు మరో రూ.60 కోట్ల వరకు వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో 6,02,937 ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వీటిద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.435.05కోట్లు ఆస్తిపన్ను, పెండింగ్‌లో ఉన్న రూ.134.54 కోట్లు కలిపి మొత్తంగా రూ.569.59 కోట్లు వసూలు చేయలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదివారం నాటికి ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్నుతోపాటు అరియర్స్‌ కింద రూ.552.50 కోట్లు వసూలు చేశారు. గత ఏడాది మార్చి 29 నాటికి రూ.436.19 కోట్లు మాత్రమే వసూలైంది. అంటే ఇప్పటికే రూ.116.3 కోట్లు అధికంగా వసూలయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు రోజులు ఉండడంతోపాటు ఈనెల 31లోగా అరియర్స్‌ చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించడంతో వసూళ్లు భారీగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

రెండురోజులు మాత్రమే గడువుండడంతో జీవీఎంసీ ప్రధానకార్యాలయంతోపాటు అన్ని జోనలకార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు నిరంతరం పనిచేసేలా కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశాలు జారీచేశారు. ఆన్‌లైన్‌లో చెల్లించాలనుకునే వారికి ప్రత్యేకయాప్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఒకేసారి అరియర్స్‌ చెల్లించే వారికి ప్రభుత్వం కల్పించిన రాయితీని తెలియజేసేందుకు రెవెన్యూ విభాగం డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు ఆటోలతో ప్రచారం చేయిస్తున్నారు. దీంతో పాటు వార్డు సచివాలయాలవారీగా పన్ను చెల్లించాల్సిన వారి జాబితా, అరియర్స్‌ జాబితాలతో ఆర్‌ఓలు, ఆర్‌ఐలు, వార్డు అడ్మిన్‌ సెక్రటరీలు ఇంటింటికీ వెళ్లి పన్ను కట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా సోమ, మంగళవారాల్లో కనీసం రూ.60 కోట్లు పన్ను వసూలవుతుందని భావిస్తున్నారు. కాగా ఆదివారం సెలవుదినమైనప్పటికీ జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌కార్గ్‌ తూర్పు జోన్‌కార్యాలయానికి వెళ్లి పన్నుల వసూలుకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. ప్రజలంతా పన్ను బకాయిలను ఈనెల 31లోగా చెల్లించి 50శాతం వడ్డీరాయితీని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Updated Date - Mar 30 , 2026 | 01:28 AM