ఇంటి పన్నుల వసూళ్లలో దూకుడు
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:39 PM
ఇంటి పన్నుల వసూళ్లలో జిల్లా దూసుకుపోతోంది. పంచాయతీలకు ఇంటి పన్నులు ప్రధాన ఆదాయం. ఈ క్రమంలో వాటి వసూళ్లకు పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
జిల్లాలో లక్ష్యం రూ.8.39 కోట్లు
వసూలు చేసింది రూ.6.48 కోట్లు
ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సింది రూ.1.86 కోట్లు
పాడేరు, చింతపల్లి, అరకులోయ మినహా మిగతా మండలాల్లో శత శాతం వసూలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఇంటి పన్నుల వసూళ్లలో జిల్లా దూసుకుపోతోంది. పంచాయతీలకు ఇంటి పన్నులు ప్రధాన ఆదాయం. ఈ క్రమంలో వాటి వసూళ్లకు పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రభుత్వం సైతం ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లక్ష్యం మేరకు వసూలు చేయాలని ఆదేశిస్తున్నది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీ అధికారులు తమ సిబ్బందిని ఇంటింటికీ పంపి మరీ పన్నులను వసూలు చేశారు. ఫలితంగా జిల్లాలో లక్ష్యం మేరకు ఇంటి పన్నులను వసూలు చేయగలిగారు.
జిల్లాలో మొత్తం లక్షా 52 వేల 926 నివాసాలకు గాను రూ.8 కోట్ల 39 లక్షలు ఇంటి పన్నుగా వసూలు చేయాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టి, రూ.6 కోట్ల 48 లక్షలు వసూలు చేశారు. ఇంకా పెండింగ్‌లో రూ.1.86 కోట్లు ఉంది. అయితే ఆ మొత్తం గత కొన్నాళ్లుగా ప్రభుత్వ సంస్థల నుంచి పంచాయతీలకు రావాల్సిన ఇంటి పన్నులు. వాస్తవానికి ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సింది మినహాయిస్తే లక్ష్యం మేరకు ఇంటి పన్నుల వసూలు పూర్తయిందని అధికారులు అంటున్నారు. అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ అభినందించారు.
ప్రభుత్వ సంస్థల నుంచి వసూలు కాని పన్నులు
ఇంటి పన్నుల చెల్లింపుల విషయంలో ప్రజలు ముందుండాలని పేర్కొనే ప్రభుత్వం, ఆయా శాఖలకు సంబంధించిన ఇంటి పన్నుల చెల్లింపుల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం. పాడేరు, అరకులోయ, చింతపల్లి వంటి ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు, ఇతర భవనాలకు సంబంధించిన ఇంటి పన్నులను గత కొన్నాళ్లుగా పంచాయతీలకు చెల్లించడం లేదు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయి ఇంటి పన్నులే రూ.1.86 కోట్లు ఉంది. అయితే ప్రజల నుంచి ముక్కుపిండి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న పంచాయతీ అధికారులు ప్రభుత్వ శాఖల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం గమనార్హం. అలాగే ప్రభుత్వ బకాయిలు లేని పెదబయలు, ముంచంగిపుట్టు, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, జీకేవీధి, జి.మాడుగుల అనంతగిరి మండలాల్లో ఇంటి పన్నుల వసూళ్లలో శత శాతం లక్ష్యం సాధించగా, ప్రభుత్వ బకాయిలున్న కారణంగానే పాడేరు, చింతపల్లి, అరకులోయల్లో లక్ష్యాన్ని చేరలేకపోయారని తెలుస్తున్నది.
జిల్లాలో మండలాల వారీగా ఇంటి పన్నుల వసూళ్ల వివరాలు
వ.సం మండలం ఇళ్ల సంఖ్య వసూలు లక్ష్యం(రూ.లక్షల్లో..) వసూలు చేసింది(రూ.లక్షల్లో..)
---------------------------------------------------------------------------------------------------------
1. అనంతగిరి 12,497 40.15 39.78
2. అరకులోయ 13,754 124.63 116.83
3. చింతపల్లి 19,119 .119.85 97.79
4. డుంబ్రిగుడ 10,462 29.63 29.63
5. జి.మాడుగుల 13,242 26.17 26.17
6. జీకేవీధి 14,178 45.01 44.36
7. హుకుంపేట 14,376 39.80 39.80
8. కొయ్యూరు 12,628 35.13 35.13
9. ముంచంగిపుట్టు 11,942 27.62 27.62
10. పాడేరు 17,118 315.94 155.98
11. పెదబయలు 13,610 35.59 35.59
----------------------------------------------------------------------------------
మొత్తం 1,52,926 839.52 648.67
----------------------------------------------------------------------------------