ధాన్యం సేకరణలో దూకుడు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:55 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నారు. సక్రాంతికి వారం రోజుల ముందు రైతులు పెద్దఎత్తున ధాన్యం అమ్మకాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 45 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించగా, జిల్లా అధికారులు ఈ నెల 23వ తేదీనాటికి 42 వేల టన్నులకుపైబడి ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
లక్ష్యానికి చేరువలో కొనుగోళ్లు
ఖరీఫ్‌లో 45 వేల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వ ఆదేశం
ఇప్పటికే 42 వేల టన్నులకుపైగా కొనుగోలు
ఎంఎస్‌పీ ప్రకారం విలువ రూ.100.81 కోట్లు
రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.95.23 కోట్లు జమ
48 గంటల్లోగా చెల్లింపులతో రైతుల ఆనందం
లక్ష్యం దాటినా.. కొనుగోలు చేస్తామని అధికారుల వెల్లడి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నారు. సక్రాంతికి వారం రోజుల ముందు రైతులు పెద్దఎత్తున ధాన్యం అమ్మకాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 45 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించగా, జిల్లా అధికారులు ఈ నెల 23వ తేదీనాటికి 42 వేల టన్నులకుపైబడి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు రోజులు, వారాల తరబడి ఎదురు చూడాల్సిన సరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం ధాన్యం విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోనే ఆయా రైతులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. దీంతో ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగానే అధిగమిస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 54,645 హెక్టార్లలో వరి సాగు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలో వర్షాలు మొహం చాటేసినప్పటికీ.. ఆగస్టు నుంచి వర్షాలు సమృద్ధిగా కురిసి, పంట చేతికొచ్చే సమయం వరకు వాతావరణం అనుకూలించింది. దీంతో 60 వేల టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేయగా, రైతుల నుంచి 45 వేల టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 65 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం సాధారణ రకం ధాన్యం క్వింటా రూ.2,300, ‘ఎ’ గ్రేడ్ ధాన్యం రూ.2,320 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ లక్ష్యం 45 వేల టన్నులు కాగా ఈ నెల 23వ తేదీనాటికి 13,237 మంది రైతుల నుంచి 42,198.33 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మద్దతు ధర ప్రకారం ఈ ధాన్యం విలువ రూ.100.81 కోట్లు. ధాన్యం విక్రయించిన రైతుల్లో 13,135 మందికి సంబంధించి రూ.95.23 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన రైతులకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతున్నది.
లక్ష్యం దాటినా.. కొనుగోలు చేస్తాం
జయంతి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని ఈ వారంలోనే చేరుకొంటాం. రైతుల వద్ద ధాన్యం వుంటే.. ఆ తరువాత కూడా కొనుగోలు చేస్తాం. వరి రైతులు, దళారులను ఆశ్రయించి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకోకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి, బ్యాంకు ఖాతా వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ జరిగిన 48 గంటల్లోనే ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఒకవేళ రైతులెవరికైనా డబ్బులు జమ కాకపోతే సమీపంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలి.