Share News

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:40 AM

స్టీల్‌ ప్లాంటు ఉద్యోగులకు చాలాకాలానికి పూర్తి జీతాలు (100 శాతం) అందాయి. గత రెండేళ్లుగా ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వడానికి యాజమాన్యం అనేక మెలికలు పెడుతూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని 50 శాతం ఒకసారి, 30 శాతం మరోసారి ఇచ్చి మిగిలిన 20 శాతం పెండింగ్‌ ఉంచేసింది.

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ఉక్కు ఉద్యోగులకు పూర్తి జీతాలు జమ

అధికార, కార్మిక వర్గాల హర్షం

విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటు ఉద్యోగులకు చాలాకాలానికి పూర్తి జీతాలు (100 శాతం) అందాయి. గత రెండేళ్లుగా ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వడానికి యాజమాన్యం అనేక మెలికలు పెడుతూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని 50 శాతం ఒకసారి, 30 శాతం మరోసారి ఇచ్చి మిగిలిన 20 శాతం పెండింగ్‌ ఉంచేసింది. ఇలా ఒక్కో ఉద్యోగికి నాలుగు నెలల జీతం బకాయి ఉంది. 2024 అంతా ఇలాగే గడిచింది. ఉత్పత్తి ఆధారిత జీతాలు అంటూ గత ఏడాది నవంబరు నుంచి ఎక్కడా లేని విధానం అమలు చేస్తోంది. ప్రతి విభాగానికి ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించి, అందులో ఎంత సాధిస్తే అంత శాతం జీతాలు ఇవ్వడం ప్రారంభించింది. దీనివల్ల ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. పూర్తి ఉత్పత్తికి అవసరమైన మెటీరియల్‌ ఇవ్వకుండా, మౌలిక వసతులు లేకుండా లక్ష్యాలు ఎలా సాధిస్తామని మొత్తుకున్నా అధికారులు పట్టించుకోలేదు. గత ఏడాది కాలంలో కేవలం రెండు నెలలు మాత్రమే కొందరు 100శాతం జీతాలు అందుకున్నారు. ఈ అంశంపై ఉద్యోగులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఇదిలావుండగా ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు రెండేళ్లకు ముందు ఎలా పూర్తి జీతాలు ఇచ్చారో అలాగే ఇప్పుడు 100 శాతం ఆయా ఖాతాలకు జమ చేశారు. దీనిపై విశాఖ స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కేవీడీ ప్రసాద్‌ హర్షం వ్యక్తంచేశారు. ఉద్యోగులు, కార్మికుల తరపున యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 02 , 2026 | 01:40 AM