Share News

ఎన్నాళ్లకెన్నాళ్లకో...

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:02 AM

పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ప్రాజెక్టు నిర్మించి రెండు దశాబ్దాలు కాగా, ఆరంభంలో ఒకటి, రెండు సంవత్సరాలు మాత్రమే పొలాలకు నీరందింది. కాలువ నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు కాలువలో పూడిక పేరుకుపోవడంతో వేలాది ఎకరాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించి, కాలువలో తుప్పలు తొలగింపు, పూడికతీత, కట్టడాలకు మరమ్మతులు, కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయించింది. జలాశయం నుంచి కాలువలకు గురువారం నీరు విడుదల చేయగా.. మరుసటి రోజుకల్లా రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు నీరు చేరింది.

ఎన్నాళ్లకెన్నాళ్లకో...
రావికమతం మండలం బుడ్డిబంద వద్ద కుడి కాలువలో ప్రవహిస్తున్న నీరు

రైతుల రెండు దశాబ్దాల కల సాకారం

పెద్దేరు కుడి కాలువ నుంచి రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు సాగునీరు

అన్నదాతల మోముల్లో ఆనందం

రావికమతం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ప్రాజెక్టు నిర్మించి రెండు దశాబ్దాలు కాగా, ఆరంభంలో ఒకటి, రెండు సంవత్సరాలు మాత్రమే పొలాలకు నీరందింది. కాలువ నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు కాలువలో పూడిక పేరుకుపోవడంతో వేలాది ఎకరాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించి, కాలువలో తుప్పలు తొలగింపు, పూడికతీత, కట్టడాలకు మరమ్మతులు, కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయించింది. జలాశయం నుంచి కాలువలకు గురువారం నీరు విడుదల చేయగా.. మరుసటి రోజుకల్లా రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు నీరు చేరింది.

మాడుగుల మండలం రావిపాలెం సమీపంలో పెద్దేరు నదిపై చేపట్టిన రిజర్వాయర్‌ నిర్మాణం 2006లో పూర్తయ్యింది. కుడి కాలువ కింద రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో తొమ్మిది వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద మాడుగుల, రావికమతం మండలాల్లో 11 వేల ఎకరాల ఆయకట్టు వుంది. ఎడమ కాలువ పరంగా రైతులు పెద్దగా ఇబ్బందులు లేవు. కుడి కాలువ విషయానికి వస్తే.. రిజర్వాయర్‌ నిర్మాణం తరువాత పూర్తి ఆయకట్టుకు రెండేళ్లు మాత్రమే నీరందింది. కాలువ తవ్వకం సమయంలో ఇంజనీరింగ్‌ అధికారుల ప్రణాళికా లోపంతో పలుచోట్ల కాలువ ఎత్తులో వుండడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, లోతట్టు ప్రాంతాల్లో కాలువ గట్లకు గండ్లు పడడం మొదలైంది. అధికారులు పనులు చేయించినా ఫలితం లేకపోయింది. దీనికితోడు కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ చేయకపోవడం, పిచ్చిమొక్కలు పెరిగిపోయి, పూడిక పేరుకుపోవడం, అక్విడక్టులు శిథిలావస్థకు చేరడంతో పొలాలకు నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల్లో సుమారు తొమ్మిది వేల ఎకరాలకుగాను వెయ్యి ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నది.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు.. పెద్దేరు కుడికాలువ అభివృద్ధిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులను కలిసి కాలువులో పూడికతీత, సిమెంట్‌ లైనింగ్‌ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించి గత ఏడాది రూ.33 కోట్లు మంజూరు చేశారు. పెద్దేరు జలాశయం వద్ద నుంచి రావికమతం మండలం మేడివాడ పెద్ద చెరువు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ చేశారు. ఇందుకు రూ.27 కోట్లు ఖర్చయ్యాయి. మిగిలిన నిధులతో అవసరమైన చోట గైడ్‌వాల్స్‌, రిటర్నింగ్‌ వాల్స్‌, ఇన్‌టేక్‌లు, ఓటీల మరమ్మతు పనులు చేశారు. పెద్దేరు కాలువలకు గురువారం నీటిని విడుదల చేయగా, ఒక్క రోజులోనే రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు నీరు చేరింది. రావికమతం మండలంలో చివరన వున్న మేడివాడ పెద్ద చెరువులోకి నీరు చేరడం మొదలైంది. ఇక్కడి నుంచి బుచ్చెయ్యపేట మండలం గున్నెంపూడి వరకు నీరు వెళుతుంది. దీంతో వరి నారుమడులు పోయడానికి రైతులు సన్నద్ధం అవుతున్నారు. రెండు దశాబ్దాల తరువాత పెద్దేరు కుడి కాలువలో నీటి ప్రవాహాన్ని చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 01 , 2026 | 01:02 AM