ఖాళీగా ఏరో ఎక్స్‌ప్రెస్‌లు
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:19 AM
ఆర్టీసీ అధికారులు గాజువాక నుంచి భోగాపురం విమానాశ్రయానికి నడుపుతున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఆదరణ పెద్దగా లేదు. మొదటి రెండు రోజులు కేవలం 20 శాతమే ఆక్యుపెన్సీ వచ్చింది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు బస్టాపుల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది.
ఆక్యుపెన్సీ 20 శాతమే
ప్రత్యేకంగా లాంజ్‌లు
నిర్మించకపోవడమే కారణం
ఉన్న బస్టాప్‌లలో వసతుల లేమి
అందుకే ఆసక్తి చూపని ప్రయాణికులు
విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ అధికారులు గాజువాక నుంచి భోగాపురం విమానాశ్రయానికి నడుపుతున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఆదరణ పెద్దగా లేదు. మొదటి రెండు రోజులు కేవలం 20 శాతమే ఆక్యుపెన్సీ వచ్చింది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు బస్టాపుల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది.
నగరంలో అనేక బస్టాప్‌లను జీవీఎంసీ కొన్నేళ్ల క్రితం ఆధునికీకరించినా వాటిల్లో వసతులు లేవు. ప్రయాణికులు తమ లగేజీతో బస్సు వచ్చేంత వరకు వేచి ఉండే వాతావరణం ఎక్కడా లేదు. దీంతో భోగాపురం వెళ్లాల్సినవారు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూడకుండా క్యాబ్‌లు బుక్ చేసుకుని వాటిలో వెళ్లిపోతున్నారు. దాంతో ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఖాళీగానే నడుస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయం నుంచి బయలుదేరే బస్సులకు మాత్రం కొద్డోగొప్పో ప్రయాణికులు ఉంటున్నారు. ఒకేసారి వంద మందికి పైగా ప్రయాణికులు విమానం దిగి బయటకు రాగానే, ఆ సమయానికి అక్కడ బస్సు ఉంటే 70 నుంచి 80 శాతం నిండుతోంది.
లాంజ్‌లు నిర్మాణం ఎప్పుడు?
ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసం ప్రత్యేక లాంజ్‌లు నిర్మించాలని ఆరు నెలల క్రితం ఏపీ విమాన ప్రయాణికుల సంఘం కోరగా, అప్పట్లో జీఎంఆర్ యాజమాన్యం అంగీకరించింది. తొమ్మిది ప్రాంతాలను ఎంపిక చేసి, తొలుత ఐదు ప్రాంతాల్లో కంటెయినర్ లాంజ్‌లు పెడతామని ప్రకటించింది. కానీ దానిని ఆచరణలో చూపించలేదు. నిధులు లేవని అధికారుల సమావేశంలో వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి విమానాశ్రయం నిర్మించిన సంస్థ రూ.25 లక్షలతో లాంజ్‌లు నిర్మించడానికి ఆసక్తి చూపకపోవడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. అయినా ఏమీ చేయలేక మౌనం వహించారు. తామైతే స్థలాలు కేటాయించామని, లాంజ్‌లు నిర్మించే బాధ్యత జీఎంఆర్‌దేనని చెబుతున్నారు. ఈ కారణంగా ఆర్టీసీ నష్టపోతోంది. ప్రయాణికులు లేకపోయినా తప్పనిసరిగా ఎయిర్‌పోర్టుకు బస్సులు నడపాల్సి వస్తోంది. ఏదోలా ప్రయాణికులు ఎక్కేలా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ జిల్లా అధికారులు ఆర్టీసీపై ఒత్తిడి పెడుతున్నట్టు తెలిసింది.
ప్రయాణ సమయం కూడా ఓ కారణం
విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి క్యాబ్, కారులో 70 నిమిషాల నుంచి 80 నిమిషాలు పడుతోంది. అదే ఏరో బస్సు ఎక్కితే 90 నిమిషాల నుంచి 100 నిమిషాలు పడుతోంది. అటు నుంచి విశాఖపట్నం రావడానికి కనీసం 80 నిమిషాలు పడుతోంది. టెర్మినల్ వద్ద బస్సు ఎక్కిన తరువాత 15 నుంచి 20 నిమిషాలకు గానీ బస్సు బయలుదేరడం లేదని చెబుతున్నారు. ఆ సమయం కూడా కలిపితే అక్కడి నుంచి విశాఖ వచ్చేసరికి గంటన్నర పడుతోంది. అదే క్యాబ్ అయితే 70 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. సత్యం జంక్షన్, ఇసుకతోట, హనుమంతవాక, ఎండాడ, కారుషెడ్, కొమ్మాది జంక్షన్లలో ఎక్కువ సమయం పడుతోంది.
ఆక్యుపెన్సీ 25 శాతం
అప్పలనాయుడు, రీజనల్ మేనేజర్, ఆర్టీసీ
ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఇప్పటివరకూ 25 శాతం ఆక్యుపెన్సీ ఉంది. ప్రయాణికులు ఇంకా అలవాటు పడాలి. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్న లాంజ్‌లు అందుబాటులోకి వస్తే ఈ బస్సులు ఎక్కే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
జీఎంఆర్ చొరవ తీసుకోవాలి
ఓ.నరేశ్‌కుమార్, ఉపాధ్యక్షులు,
ఏపీ విమాన ప్రయాణికుల సంఘం
జీఎంఆర్ యాజమాన్యం నగరంలో ఐదు చోట్ల లాంజ్‌లు నిర్మిస్తామని తెలిపింది. కానీ కార్యాచరణ ఎక్కడా కనిపించడం లేదు. అవి అందుబాటులోకి వచ్చేంత వరకు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపినా ప్రయోజనం ఉండదు. ఎవరూ ఎక్కరు. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆ సంస్థ వారిపై ఉంది.